'2019లో ఏపీలో వైసీపీదే అధికారం, చంద్రబాబు బయోపిక్ తీస్తే టైటిల్స్ ఇవే'
అమరావతి: వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో శ్వేతపత్రాలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాలకు తెరలేపారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బాలశౌరి సోమవారం అన్నారు. 23 మంది తమ పార్టీ ఎమ్మెల్యేలను చంద్రబాబు ఎన్ని కోట్లకు కొన్నారో వాటిపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇక వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తాం: టీడీపీ ఎదురుదాడి, మధ్యలో రామ్ గోపాల్ వర్మ
2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, అలాగే ఈ నాలుగున్నరేళ్లలో అమలు చేసిన హామీలపై కూడా శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. హైకోర్టు విభజన చేయమని సుప్రీం కోర్టులో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని చెప్పారు. కానీ ఇప్పుడు హైకోర్టును కట్టడంలో విఫలమయ్యారన్నారు.

చంద్రబాబు సాకులు
ప్రత్యేక హోదా కోసం, ఏపీ విభజన హామీల కోసం ధర్మపోరాట దీక్ష అంటూ చంద్రబాబు చేసే దీక్షల్లో పోరాటం లేదని, ధర్మం అంతకంటే లేదని బాలశౌరి అన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్ ఏపీ ప్రజల చెవుల్లో పూవులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టును కట్టడంలో విఫలమైన చంద్రబాబు సాకులు చెబుతున్నారన్నారు.

2019లో వైసీపీ అధికారంలోకి వస్తుంది
గతంలో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీని చంద్రబాబు దెయ్యంతో పోల్చారని బాలశౌరి గుర్తు చేశారు. ఇప్పుడు ఆమె దెయ్యంలా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధిపై చంద్రబాబు ఇప్పటి వరకు తొమ్మిది శ్వేతపత్రాలు విడుదల చేశారని, ఆయనకు నిజంగా దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు ఎన్నికోట్లు ఇచ్చి కొన్నారో చెప్పాలన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వస్తుందన్నారు.

చంద్రబాబు బయోపిక్ తీస్తే దానికి టైటిల్స్ ఇలా
తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దూషిస్తుంటే చంద్రబాబు ముసిముసిగా నవ్వారని, ఇదే ఆయన సంస్కారమా అని బాలశౌరి ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రులు వైయస్ రాజశేఖర రెడ్డి, జయలలిత జీవితాలపై బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయని, ఇదే తరహాలో చంద్రబాబు బయోపిక్ కూడా తీస్తే దానికి మహానగరంలో మాయగాడు యూటర్న్ మోసగాడు అని టైటిల్ పెట్టవచ్చన్నారు.

మోడీపై పోరాడలేక
ప్రధాని నరేంద్ర మోడీపై పోరాడలేక వైయస్ జగన్ పైన చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి వేరుగా అన్నారు. మోడీతో తమకు సంబంధాలు అంటగట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప దాటడం లేదన్నారు. మోడీ ఒడిలో కూర్చొని నవనిర్మాణ దీక్ష చేసి, కాంగ్రెస్ పార్టీతో కలిసి ధర్మపోరాట దీక్ష అంటున్నారన్నారు. తాను చేస్తున్న తప్పులు కప్పిపుచ్చుకోవడానికి రాష్ట్ర ప్రజలను వాడుకుంటున్నారన్నారు.