లోకేష్ నిన్న, చంద్రబాబు పదే పదే: జగన్ పార్టీ
హైదరాబాద్: అధికారంలోకి రాగానే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ఎజెండాను పూర్తిగా మార్చేసుకున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వ్యాఖ్యానించారు. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారన్నారు. నారా లోకేష్ నిన్న మాట్లాడిన తీరు, చంద్రబాబు పదే పదే మాట్లాడిన తీరు అందుకు నిదర్శనమని వారన్నారు.
అధికారం శాశ్వతం కాదని, వ్యక్తిగత గుణం ముఖ్యమని, పాలన చేసే పద్ధతి ప్రధానమని వారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు నాయకులు శ్రీకాంత్ రెడ్డి, శ్రీనివాసులు, దేవగుడి నారాయణ రెడ్డి, సురేష్ బాబు, అమర్నాథ్ రెడ్డి గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా తనకు రాజకీయ ప్రత్యర్థులు ఎవరూ ఉండకూడదనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులను మట్టుబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదని, అప్పుడే ఆ పార్టీ కార్యకర్తలు తమ పార్టీ కార్యకర్తలపై భౌతిక దాడులకు దిగుతున్నారని వారన్నారు.
ఇది ప్రజాస్వామ్యమా, హిట్లర్ పాలనా అని వారు ప్రశ్నించారు. గవర్నర్‌ను తప్పుదోవ పట్టించే విధంగా చంద్రబాబు వ్యవహరించారని వారన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను అరికట్టడంలో తమ సహకారం పూర్తిగా ఉంటుందని వారు చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్లలో పలువురు టిడిపి నేతలున్నారని వారు ఆరోపించారు.
తాము గవర్నర్ అపాయింట్‌మెంట్ అడిగామని, త్వరలోనే గవర్నర్‌ను కలిసి అన్ని విషయాలూ వివరిస్తామని చెప్పారు. టిడిపి వ్యవహార శైలి ఇదే విధంగా కొనసాగితే తాము చూస్తూ సహించబోమని, తగిన గుణపాఠం చెబుతామని వారన్నారు.












Click it and Unblock the Notifications