రెండో రోజూ అదే ఉధృతి: సొంత జిల్లాలో చంద్రబాబు దిష్టిబొమ్మకు పాడె కట్టిన వైసీపీ
తిరుపతి: తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన నిరసన ప్రదర్శనల ఉధృతి తగ్గలేదు. రెండో రోజు కూడా రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నాయకులు తమ జనాగ్రహ ప్రదర్శనలను కొనసాగిస్తున్నారు. నిరసన ప్రదర్శనలు, ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. పట్టాభి అసభ్య పదజాలాన్ని వాడటానికి పార్టీ అధినేత హోదాలో చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తోన్నారు.

తగ్గని ఉధృతి
ఆ బూతు పదాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబడుతున్నారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా దాకా ఇదే పరిస్థితి నెలకొంది. ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, లోక్‌సభ సభ్యులు, ఎమ్మెల్యేలు ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. దీనికి పోటీగా చంద్రబాబు చేపట్టిన 36 గంటల దీక్ష కొనసాగుతోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన దీక్షకు కూర్చున్నారు.

బహిరంగ క్షమాపణ
చంద్రబాబు బహిరంగంగా క్షమాపణలు చెప్పేంత వరకూ నిరసన ప్రదర్శనలను కొనసాగిస్తామని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. శుక్రవారం కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు జనాగ్రహ దీక్షలు కొనసాగిస్తున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించు కోవాలని, క్షమాపణలు చెప్పాలనేది వారి ప్రధాన డిమాండ్. చంద్రబాబు సిగ్గుమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారని, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకొనే చంద్రబాబు.. ఈ స్థాయికి దిగజారడం దౌర్భాగ్యమని విమర్శించారు.
తిరుపతిలో శవయాత్ర
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను అసభ్య పదజాలంతో దూషించిన వ్యవహారంలో పట్టాభి అరెస్ట్ అయ్యారు. న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ఆయనను 14 రోజుల పాటు రిమాండ్‌కు పంపించింది న్యాయస్థానం. రెండో రోజు నిరసన ప్రదర్శనల్లో భాగంగా వైఎస్సార్‌సీపీ నాయకులు తిరుపతిలో చంద్రబాబు దిష్టిబొమ్మకు శవయాత్రను నిర్వహించారు. చంద్రబాబు ఫొటోను అతికించిన దిష్టిబొమ్మకు పాడె కట్టి.. తిరుపతి బస్టాండ్ సమీపంలో శవయాత్రను నిర్వహించారు.

రాష్ట్రంలో అశాంతికి కుట్ర
చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలతో రాష్ట్రంలో అశాంతి, గందరగోళాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వారు మండిపడ్డారు. అధికారంలో లేకపోతే.. ఒక్క రోజు కూడా చంద్రబాబు స్థిమితంగా ఉండలేరనేది ఈ కుట్ర రాజకీయాలతో తేటతెల్లమౌతోందని అన్నారు. ఇక ముందు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చే పరిస్థితి కూడా లేదని తేల్చి చెప్పారు. రాజకీయ విషక్రీడకు చంద్రబాబు తెరతీస్తున్నారని వైసీపీ నాయకులు ధ్వజ మెత్తారు. ప్రజల నుంచి ఆదరణ పొందుతున్న వైఎస్ జగన్‌ను చూసి టీడీపీ ఓర్వలేకపోతోందని అన్నారు.

నారా లోకేష్‌ను బలవంతంగా రుద్దే ప్రయత్నం..
తన పార్టీ నాయకులను ఉద్దేశపూరకంగా రెచ్చగొట్టి, రాష్ట్రాన్ని అల్లకల్లోలానికి గురి చేస్తోందని ఆరోపించారు. పప్పుసుద్ద, దద్దమ్మగా మారిన నారా లోకేష్ నాయకత్వాన్ని పార్టీ నేతలకు బలవంతంగా రుద్దడానికి విశ్వ ప్రయత్నాలు చంద్రబాబు చేస్తున్నాడని విమర్శించారు. నారా లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించడానికి ఏ ఒక్క టీడీపీ నాయకుడు కూడా సిద్ధంగా లేరని అన్నారు. చంద్రబాబు తన వయ స్సుకు తగ్గట్టు వ్యవహరించాలని, అల్లర్లకు కుట్రలు పన్నడం మానుకోవాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు హితవు పలికారు.