మేకపాటి - ఉండవల్లి శ్రీదేవి స్థానంలో వైసీపీ కొత్త అభ్యర్ధులు ఖరారు..!?
ఆ నలుగురి పై వైసీపీ గుర్రుగా ఉంది. క్రాస్ ఓటింగ్ చేసారంటూ ఆ నలుగురిని సస్పెండ్ చేసింది. మరిన్ని చర్యల దిశగా అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి న్యాయ - రాజకీయ పరమైన అంశాల పైన కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో అందులో ఇద్దరు నియోజకవర్గాల్లో కొత్త నేతలకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు.
మిగిలిన ఇద్దరి నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్దులు దాదాపు ఖరారయ్యారు. దీని ద్వారా ఆ నియోజకవర్గాల్లో కేడర్ లో డైలమా లేకుండా కొత్త ఇంచార్జ్ లను సిద్దం చేసారు. దీని ద్వారా తమను ధిక్కరించిన వారిని రాజకీయంగానే దెబ్బ తీయాలనేది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది.
సీనియర్ ఎమ్మెల్యే ఆనం..కోటంరెడ్డి పార్టీని వ్యతిరేకించిన సమయంలోనే ఆ ఇద్దరి నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జ్ లకు బాధ్యతలు అప్పగించారు. వెంకటగిరిలో నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి, నెల్లూరు రూరల్ లో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి పార్టీ బాధ్యతలు కేటాయించింది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తో ఈ ఇద్దరితో పాటుగా మేకపాటి చంద్రశేఖర రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి పైన పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది.
తదుపరి చర్యలు ఉంటాయంటూ పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇప్పుడు మేకపాటి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయగిరితో పాటుగా ఉండవల్లి శ్రీదేవి నియోజకవర్గం తాడికొండలోనూ పూర్తి స్థాయిలో ఇంచార్జ్ లను నియమించేందుకు రంగం సిద్దమైందని తెలుస్తోంది.

అమరావతి పరిధిలోని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీదేవి తాను స్వతంత్ర ఎమ్మెల్యేనని ప్రకటించుకున్నారు. అమరావతి రాజధానికి జై కొట్టారు. స్థానిక రైతులతో కలిసి అమరావతి ఉద్యమానికి మద్దతుగా పాల్గొంటానని ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో కొత్త సమన్వయకర్తను నియమించటం..వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వరనే ప్రచారం కారణంగానే శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే చర్చ పార్టీ లో వినిపిస్తోంది.
శ్రీదేవి మాత్రం తాను క్రాస్ ఓటింగ్ చేసానని ఎలా చెబుతారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అక్కడ కత్తెర సురేష్ కుమార్ అదనపు సమన్వయకర్తగా ఉన్నారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇక్కడ నుంచి మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ను వైసీపీ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. గతంలో ఆయన ఇక్కడ సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పని చేసారు. శ్రీదేవి భవిష్యత్ లో టీడీపీలో చేరితే ఆ పార్టీ సీటు ఇస్తుందా లేక, ఇప్పటికే ఉన్న నేతలకు ప్రాధాన్యత ఇస్తుందా అనేది తేలాల్సి ఉంది.
నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖ రెడ్డి మూడు సార్లు గెలుపొందారు. మేకపాటి నియోజకవర్గంలో పట్టు కోల్పోయినట్లు గుర్తించి..అక్కడ కొత్తగా సమన్వయకర్తను నియమించారు. ఇదే మేకపాటి ఆగ్రహానికి కారణమైంది. వచ్చే ఎన్నికల్లో సీటు పైన హామీ లేని కారణంగానే క్రాస్ ఓటింగ్ చేసారనే చర్చ సాగుతోంది. ఇదే సమయంలో ఉదయగిరిలో ముగ్గురు అభ్యర్దులను వైసీపీ పరిశీలన చేస్తోంది.
ప్రస్తుతం సమన్వయకర్తగా నియమించిన ధనుంజయరెడ్డి పేరు పైనా పార్టీలో ఏకాభిప్రాయం లేదనే వాదన ఉంది. దీంతో.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి పేరు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో చంద్రశేఖరరెడ్డి తాజా నిర్ణయంతో మేకపాటి కుటుంబ సభ్యులు అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. అన్నిఅంశాలను పరిశీలించి ఈ ఇద్దరిలో ఒకరికి బాధ్యతలు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications