విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ సడన్ గా ఊడిపడ్డాడు అందుకే.. వైసీపీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ 31వ తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల ఉద్యమానికి తన మద్దతు ప్రకటిస్తూ, ఏపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకోవడం కాకుండా, అఖిలపక్షం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా జగన్ సర్కార్ పనిచేయాలని జగన్ సర్కార్ ను టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ కు వైసీపీ నేతలు చురకలంటించారు. ఇంతకాలం ఎక్కడున్నావ్ అంటూ ప్రశ్నిస్తున్నారు.

స్టీల్ ప్లాంట్ ఉద్యమం గత ఆర్నెల్లుగా .. ఇప్పుడొచ్చి పవన్ హడావిడి
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాష్ట్రమంత్రి సీదిరి అప్పల రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన మంత్రి అప్పలరాజు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మికుల ఉద్యమం ఆరు నెలలుగా కొనసాగుతుంటే ఇప్పుడొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. ఈ ఆర్నెల్లపాటు పవన్ కళ్యాణ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ఆరు నెలలుగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పోరాటం సాగుతుంటే, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ మద్దతు ప్రకటించి కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.

పవన్ ఆర్నెల్లుగా షూటింగ్ లో బిజీనా? లేక విహారయాత్రలో బిజీనా?
ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం యూటర్న్ తీసుకునే సంకేతాలు కూడా ఉన్నాయని పేర్కొన్న మంత్రి సీదిరి అప్పలరాజు, ఇలాంటి తరుణంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న పోరాటానికి పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. గత ఆరు నెలలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడని పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారా లేక విహారయాత్రలో బిజీగా ఉన్నారా అంటూ ప్రశ్నించిన మంత్రి సీదిరి అప్పల రాజు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం యూటర్న్ తీసుకుంటే ఆ క్రెడిట్ తమకే ఎక్కడ దొరుకుతుందో అన్న భయంతోనే పవన్ కళ్యాణ్ సడన్ గా ఊడి పడ్డాడని వ్యాఖ్యానించారు.

వైసీపీ ప్రభుత్వానికి గడువు ఇవ్వటానికి పవన్ కున్న అర్హతలేంటి?
విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపడుతున్న పోరాటానికి పవన్ కళ్యాణ్ సంఘీభావం తెలపడం వెనుక కారణం అదే అని పేర్కొన్న సీదిరి అప్పల రాజు రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ వారం రోజుల గడువు ఇస్తూ అల్టిమేటం జారీ చేశారని, అసలు రాష్ట్ర ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గడువు ఇవ్వడానికి అతనికున్న అర్హతలేమిటి అంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అనుకూలంగా చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్ చదువుతున్నాడని, అలా చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్ చదవడం మానుకొని నీకు నువ్వుగా ఏమైనా విమర్శలు చేయగలవా అంటూ పవన్ కళ్యాణ్ ని ఎద్దేవా చేశారు మంత్రి అప్పలరాజు.

చంద్రబాబు దృతరాష్ట్రుడు .. చెర నుండి బయటపడు .. మంత్రి హితవు
దృతరాష్ట్రుడి చెరనుండి పవన్ కళ్యాణ్ ముందుగా బయటపడే పనిలో ఉంటే మంచిదని హితవు చెప్పారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, ఏపీ ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదని సీదిరి అప్పల రాజు వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ అజ్ఞాని అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, విషయాలపై అవగాహన లేకుండా పవన్ కళ్యాణ్ మాట్లాడడం శోచనీయమని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ ది రాజకీయ అజ్ఞానం
బద్వేలు, తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలుపుతూ మరోవైపు కేంద్రంతో పోరాడతానని పవన్ కళ్యాణ్ చెప్పటం తన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. ఇది చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ఆడుతున్న డ్రామా అని మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యానించారు . త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి స్టీల్ ప్లాంట్ పై సానుకూలమైన నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు.












Click it and Unblock the Notifications