వైసీపీ ఎంపీ వ్యాఖ్యల్ని ఖండించిన వైసీపీ మంత్రి-అసలేం జరిగిందంటే ?
ఏపీలో నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్న వైసీపీ .. ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టింది. ఈ సమయంలో గత ఎన్నికల్లో ఓటేసిన అన్ని వర్గాలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా పార్టీలో ఎస్సీ ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. ఇందులో పలువురు అధికార పార్టీకి చెందిన ఎస్సీ ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా చెప్పేశారు. ఈ సందర్భంగా అమలాపురం ఎంపీ చింతా అనురాధ కూడా హాట్ కామెంట్స్ చేశారు.
రాష్ట్రంలో దళితులకు సంక్షేమ పథకాలు అందడం లేదంటూ నిన్న జరిగిన ఎస్సీ ప్రజాప్రతినిధుల భేటీలో చింతా అనురాధ వ్యాఖ్యానించినట్లు వార్తలొచ్చాయి. దీనిపై పార్టీలో అంతర్గతంగా, బయట కూడా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీ ఎంపీ అనురాధ వ్యాఖ్యలపై మంత్రి విశ్వరూప్ స్పందించారు. ఒకే జిల్లాకు చెందిన సొంత పార్టీ నేత చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతూ మంత్రి చేసిన కామెంట్స్ మరింత వైరల్ అవుతున్నాయి.

అమలాపురం ఎంపీ అనురాధ వ్యాఖ్యలను మంత్రి విశ్వరూప్ ఇవాళ ఖండించారు. అమలాపురం ఎంపీ చింతా అనురాధ దళితులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్న వ్యాఖ్యలను మంత్రి పినిపే విశ్వరూప్ ఖండించారు. ఎంపీ కి అవగాహన లేకా.. మరి ఏ ఉద్దేశంతో మాట్లాడిందో కూడా నాకు తెలియడం లేదు ఆమె మాటలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా.. అని మంత్రి విశ్వరూప్ వ్యాఖ్యానించారు.
మరోవైపు రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో ఎక్కువ శాతం లబ్ధి పొందుతుంది దళితులేనంటూ మంత్రి విశ్వరూప్ వెల్లడించారు.రాష్ట్రంలో ఎస్సీలు లబ్ధి పొందడం లేదు అన్నమాట ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ విశ్వరూప్ వ్యాఖ్యానించారు. ఎంపీ అవగాహన లేకుండా మాట్లాడిన మాటలను ప్రతి ఒక్కరూ ఖండించవలసిన విషయం అంటూ మంత్రి విశ్వరూప్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో 52 వేల కోట్ల మొత్తాన్ని ఎస్సీలు లబ్ధి పొందారంటూ మంత్రి విశ్వరూప్ గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications