పోలీసుల సంరక్షణలో ఆనందయ్య-మందు పంపిణీకి బ్రేక్-అప్పుడే బ్లాక్ దందా మొదలుపెట్టిన కేటుగాళ్లు
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన నాటు వైద్యుడు ఆనందయ్యను అరెస్టు చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఆనందయ్యపై కుట్రలు జరుగుతున్నాయని... ఆయన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వాట్సాప్,ఫేస్‌బుక్‌లలో మెసేజ్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఆనందయ్యను అరెస్ట్ చేసినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి ఖండించారు. అవన్నీ వదంతులేనని... ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయనకు భద్రత కల్పించి పోలీసుల సంరక్షణలో ఉంచినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

మందు పంపిణీకి బ్రేక్...
కృష్ణపట్నంలోని ఇంటి నుంచి ఆనందయ్యను పోలీసులు నెల్లూరు తరలించినట్లు తెలుస్తోంది. మందు సామాగ్రిని కూడా ఆనందయ్య తన వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. శనివారం(మే 22) ఆయుష్ అధికారులు,ఐసీఎంఆర్ అధికారుల పర్యవేక్షణలో ఆనందయ్య ఆయుర్వేద మందు తయారుచేయనున్నారు. అనంతరం ఆ మందును అధికారులు ల్యాబ్‌కు పంపించి దాని శాస్త్రీయతను పరిశీలించనున్నారు. ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చేంతవరకూ కృష్ణపట్నంలో మందు పంపిణీకి బ్రేక్ పడినట్లే. కాబట్టి ఆయుర్వేద మందు కోసం ఎవరూ నెల్లూరు గానీ కృష్ణపట్నం గానీ రావొద్దని పోలీసులు,అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చాకే మందు పంపిణీ కార్యక్రమం జరుగుతుందని చెబుతున్నారు.

రిపోర్టులు ఎప్పుడొస్తాయి...?
ఆనందయ్య మందుపై ల్యాబ్ రిపోర్టులు ఎప్పటివరకు రావొచ్చన్న దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. అటు కేంద్రం కూడా ఈ మందుపై దృష్టి సారించిన నేపథ్యంలో త్వరితగతిన దీనికి సంబంధించిన ల్యాబ్ టెస్టులు పూర్తి చేసే అవకాశం లేకపోలేదు. ఒకవేళ ఒకటి,రెండు రోజుల్లో ల్యాబ్ నుంచి పాజిటివ్ రిపోర్టులు వస్తే ప్రభుత్వమే మందు పంపిణీకి ఏర్పాట్లు చేయవచ్చు. కేవలం కృష్ణపట్నంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మందు పంపిణీకి ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మందుకు శాస్త్రీయత లేదని గనుక ల్యాబ్ రిపోర్టులు వస్తే మందు పంపిణీకి శాశ్వతంగా బ్రేక్ పడుతుందా అనేది చర్చనీయాంశమైంది. ఆనందయ్య ఇస్తున్న మందుతో భవిష్యత్తులో ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా.. మందును నేరుగా కంటిలో డ్రాప్స్ ద్వారా వేయడం సరైనదేనా వంటి సందేహాలకు ల్యాబ్ రిపోర్టులో జవాబులు దొరికే అవకాశం ఉంది.

బ్లాక్ దందాకు తెరలేపిన కేటుగాళ్లు...
ఆనందయ్య ఆయుర్వేద మందులో శాస్త్రీయతను నిరూపించే ప్రయత్నాలు ఓవైపు సాగుతుండగానే... కొందరు కేటుగాళ్లు బ్లాక్ దందాకు తెరలేపారు. ఆనందయ్య ఆయుర్వేద మందు పేరుతో బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరకు ఆకు పసరు మందును విక్రయిస్తున్నారు. ఒక ప్యాకెట్‌కు రూ.3వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆనందయ్య ప్రజల మేలు కోసం ఉచితంగా మందు పంపిణీ చేపట్టగా... దాన్ని సొమ్ము చేసుకునేందుకు ఇలాంటి కేటుగాళ్లు బ్లాక్ దందాకు తెరలేపడం గమనార్హం. పోలీసులు వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ వినిపిస్తోంది.

కృష్ణపట్నంకు రాకపోకలపై ఆంక్షలు
శుక్రవారం(మే 21) ఒక్కరోజే దాదాపు 50వేల పైచిలుకు మంది ఆనందయ్య ఆయుర్వేద మందు కోసం కృష్ణపట్నం వెళ్లారు. కానీ కేవలం 3వేల మందికి మాత్రమే మందు పంపిణీ చేయగలిగారు. జనం భారీ ఎత్తున తరలిరావడంతో వారిని అదుపు చేయడం పోలీసుల వల్ల కూడా కాలేదు. జనం ఇలాగే పోటెత్తితే పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. మొదట దీని శాస్త్రీయతను పరిశీలించాక... ఉన్నతాధికారుల రిపోర్టును బట్టి ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఐసీఎంఆర్,ఆయుష్ బృందాలు మందు తయారీని పరిశీలిస్తున్నాయి. ల్యాబ్ నుంచి రిపోర్టులు వచ్చాక ప్రభుత్వం ఈ మందు పంపిణీపై నిర్ణయం తీసుకుంటుంది. అప్పటివరకూ ఎవరూ కృష్ణపట్నం రావొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. అటువైపు రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నారు.












Click it and Unblock the Notifications