నాన్ పొలిటికల్ జేఏసీ కార్యాచరణ ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్యే-రేపటి నుంచి రచ్చ రచ్చే..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో అమరావతి రైతుల పాదయాత్ర ప్రభుత్వ పెద్దల్ని కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు విశాఖ కేంద్రంగా నాన్-పొలిటికల్ జేఏసీని దగ్గరుండి మరీ ఏర్పాటు చేయించారు. ఇప్పుడు అమరావతి పాదయాత్రను అడ్డుకోవడంతో పాటు మూడు రాజధానుల సాధన దిశగా స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే కార్యాచరణ కూడా ప్రకటించేశారు.
అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇవాళ నాన్-పొలిటికల్ జేఏసీ కార్యాచరణను ప్రకటించారు. అమరావతి టు అరసవల్లి పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్రపై దండయాత్రకు వస్తున్నారని, రాజధానిగా అమరావతి వద్దు అని తాము అనలేదని కరణం తెలిపారు. అమరావతి తో పాటు అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలని ఉద్దేశంతో వికేంద్రీకరణను కోరుకుంటున్నామన్నారు. విశాఖ రాజధాని వద్దు అమరావతి ముద్దు అంటూ ఒకే రాజధాని ఉండాలని చెప్పడానికి వాళ్ళు ఎవరని కరణం ప్రశ్నించారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే విశాఖ కేంద్రంగా పారిశ్రామిక రాజధాని అవసరమన్నారు.

ఇటీవల విశాఖలో మేధావులు విద్యావేత్తలు పారిశ్రామికవేత్తలు తో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి లజపతిరాయ్ చైర్మన్ గా జేఏసీ ఏర్పాటు చేశామని, దానికి అనుబంధంగా రేపటినుండి ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాలలో రోజుకు రెండు నియోజకవర్గాల చొప్పున రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో నుండి జిల్లా జేఏసీకి అనుబంధంగా కమిటీలు ఏర్పాటు చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. అనకాపల్లి జిల్లాల్లో మూడు మున్సిపాలిటీలో తో పాటు ప్రతి నియోజకవర్గంలో బైక్ ర్యాలీలు కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టి క్షేత్రస్థాయిలో మా నిరసనను ప్రజల్లోకి తీసుకువెళ్లి మరింతగా ఉద్యమిస్తామన్నారు.
అక్టోబర్ 15వ తేదీన విశాఖపట్నంలో అంబేద్కర్ విగ్రహం నుండి యూనివర్సిటీ మీదుగా పార్క్ హోటల్ వరకు నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర చేపడతామని వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశాల్లో లాయర్లు డాక్టర్లు, విద్యార్థులు స్వచ్ఛంద సంస్థలు మేధావులు విద్యావేత్తలు వాణిజ్యవేతలు పాల్గొనవలసిందిగా పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లాలో అడుగు పెట్టబోతున్న పాదయాత్ర కు ప్రతి ఒక్కరు మన ఉత్తరాంధ్ర నిరసన సెగ తెలియజేయాలన్నారు.












Click it and Unblock the Notifications