అమరావతి రైతులను కలిసిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి; జగన్ కు షాక్ ఇచ్చారా?
ఆంధ్రప్రదేశ్ కు ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని అమరావతి ప్రాంత రైతులు మహా పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అమరావతి మాత్రమే రాజధానిగా కొనసాగాలని నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రైతుల వద్దకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్లి తమ సంఘీభావం తెలపడం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశమైంది. జగన్ నిర్ణయాన్ని కోటంరెడ్డి వ్యతిరేకిస్తున్నారా లేకా మరేదైనానా అన్న చర్చ జరుగుతుంది.

రైతుల మహా పాదయాత్రకు వైసీపీ ఎమ్మెల్యే సంఘీభావం
ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు రాజధానులు ఏర్పాటుకు జై కొట్టి, రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామని తేల్చి చెప్తుంది. ఇక రాజధాని అమరావతి కోసం పాదయాత్ర చేస్తున్న రైతుల ఉద్యమాన్ని, పెయిడ్ ఆర్టిస్టులు చేస్తున్న ఉద్యమంగా అభివర్ణిస్తుంది. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా ఇటీవల అసెంబ్లీలో మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న సమయంలో, తిరిగి మరో కొత్త బిల్లు సభలో ప్రవేశ పెడతామని తేల్చి చెప్పారు. మొత్తం వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ఏర్పాటు జపం చేస్తూ ఉంటే, అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనను, పాదయాత్రను అడుగడుగునా వ్యతిరేకిస్తుంటే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా పాదయాత్ర చేస్తున్న రైతుల వద్దకు వెళ్లి తన సంఘీభావాన్ని ప్రకటించారు.

ఏ అవసరం వచ్చినా తనకు చెప్పాలన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆదివారం నాడు మహా పాదయాత్రకు బ్రేక్ ప్రకటించి, తాము బస చేసిన ఎస్ఎస్బి ఫంక్షన్ హాల్ లో ఆందోళన కొనసాగించిన అమరావతి రైతుల వద్దకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారిని కలిశారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఏ అవసరం వచ్చినా తనకు చెప్పాలని తప్పకుండా సహకరిస్తానని ఆయన వారికి భరోసా ఇచ్చారు.
అయితే వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో మాట్లాడిన రైతులు జై అమరావతి అనాలని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ని కోరగా, రైతులు ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. అలా అనడానికి తనకు ఇబ్బందులు ఉన్నాయని ఆయన రైతులకు నచ్చజెప్పారు.

అడుగడుగునా అమరావతి ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ .. కానీ వైసీపీ ఎమ్మెల్యే మద్దతు
నెల్లూరు రూరల్ జిల్లాలో వారం రోజుల పాటు రైతుల మహా పాదయాత్ర కొనసాగుతుందని రైతులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి చెప్పారు. ఇక తమకు సంఘీభావం తెలపడానికి వచ్చిన కోటం రెడ్డికి ఓ రైతు మెడలో కండువా వేయడానికి ప్రయత్నించగా ఆయన వద్దని నిరాకరించారు. ఒకపక్క వైసీపీ ప్రభుత్వం అడుగడుగునా అమరావతి రైతులు చేసిన పాదయాత్రను వ్యతిరేకిస్తుంది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అమరావతి రైతుల పైన పరుష పదజాలంతో విరుచుకు పడుతున్నారు.
అది మహా పాదయాత్ర కాదు, టీడీపీ పాదయాత్ర అని, శ్రీమంతుల పాదయాత్ర అని, చంద్రబాబు బినామీల యాత్ర అని టార్గెట్ చేస్తున్నారు .ఇలాంటి సమయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం అమరావతి రైతులకు సంఘీభావం పలకడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారుతోంది.

జగన్ కు షాక్ ఇచ్చిన కోటం రెడ్డి ... రాజధాని అమరావతి రైతులకు సంఘీభావం
ఇక రైతుల శిబిరం వద్దకు వైసీపీ ఎమ్మెల్యే రావడం నెల్లూరు జిల్లాలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే వైసీపీ కీలక నేతలు కొందరు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కి ఫోన్ చేసి ఈ వ్యవహారంపై మాట్లాడినట్టు సమాచారం. ఒకపక్క ప్రభుత్వం అమరావతి రాజధానిగా కొనసాగాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సమయంలో, వైసీపీ ఎమ్మెల్యే రాజధాని అమరావతికి మద్దతు పలకడం ఒక రకంగా జగన్ కు షాక్ అనే చెప్పాలన్న చాచ జరుగుతుంది.

రాజధాని రైతులను కలవటంపై క్లారిటీ ఇచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా తాను వెళుతున్న క్రమంలో రాజధాని రైతుల వద్దకు వెళ్లానని, వర్షాల కారణంగా వారికి ఏదైనా ఇబ్బంది కలిగితే తనకు చెప్పాలని కోరానని పేర్కొన్నారు.
వర్షాల కారణంగా ఎవరు ఇబ్బంది పడకూడదనే తన అభిమతమని పేర్కొంటూ ఆయన పార్టీ ఏ స్టాండ్ లో వెళితే అదే నా స్టాండ్ అని చెప్పానని క్లారిటీ ఇచ్చారు. రూరల్ నియోజకవర్గ పరిధిలో వర్షాలు వరదల కారణంగా ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తాను ఆ పని చేశానని స్పష్టం చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. అదే మానవత్వం, సంస్కారం అంటూ ఆయన పేర్కొన్నారు.