ఒక్క అమరావతి - మూడు రాజధానులు: వైసీపీ ఎమ్మెల్యే కాలు ఫ్రాక్చర్..!!
అనకాపల్లి: రాష్ట్రంలో పోటాపోటీగా ఉద్యమాలు మొదలయ్యాయి. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్రకు పోటీగా ప్రదర్శనలు ఆరంభం అయ్యాయి. రైతులు చేపట్టిన పాదయాత్ర తమ గమ్యస్థానానికి చేరువ అవుతున్న కొద్దీ ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. మూడు రాజధానులకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశాలు తీవ్రం అయ్యాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బైక్ ర్యాలీలను హోరెత్తిస్తోన్నారు.
రౌండ్ టేబుల్ సమావేశాల్లో రాజీనామాలు కూడా నమోదవుతోండటం- రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. మూడు రాజధానులకు అనుకూలంగా వైఎస్ఆర్సీపీ శాసనసభ్యుడు కరణం ధర్మశ్రీ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన స్పీకర్ కార్యాలయానికి పంపించారు. స్పీకర్ ఫార్మట్‌లోనే ఈ రాజీనామా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. మూడు రాజధానులను తక్షణమే ఏర్పాటు చేయాలనేది ఆయన డిమాండ్.

అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గ సహచరుడు ధర్మాన ప్రసాద రావు, మాజీమంత్రి అవంతి శ్రీనివాస్ కూడా రాజీనామాకు సిద్ధపడ్డారు. వైఎస్ జగన్ ఆదేశిస్తే- వెంటనే రాజీనామా చేస్తానని ధర్మాన ప్రకటించారు. ఉత్తరాంధ్ర వరకు మాత్రమే ఈ ఉద్యమాలు పరిమితం కాలేదు. అటు తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ దీని తీవ్రత పతాక స్థాయికి చేరుకుంటోంది.
కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించాలని, దీనికి సంబంధించిన చర్యలన్నింటినీ తక్షణమే పూర్తి చేయాలంటూ కర్నూలు జిల్లా బార్ అసోసియేన్ ప్రతినిధులు కొద్దిరోజులుగా నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తూ వస్తోన్నారు. బైక్ ర్యాలీలను నిర్వహించారు. తరచూ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్మాలను నిర్వహిస్తోన్నారు. ఇదే తరహా నిరసనలు, బైక్ ర్యాలీలు ఇప్పుడు తాజాగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గ స్థాయిలో ఊపందుకున్నాయి.
అనకాపల్లి జిల్లా నర్సీంపట్నంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. బైక్ ర్యాలీలో వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు పెట్ల ఉమాశంకర్ గణేష్ గాయపడ్డారు. ఎమ్మెల్యే నడుపుతున్న బైక్‌ను పొరపాటున స్కూటర్ ఢీకొట్టడంతో ఆయన కింద పడిపోయారు. ఆయన కాలికి తీవ్రగాయమైంది. ఎడమ కాలికి ఎముక చిట్లినట్లు తేలింది. దీనితో ఆయనను హుటాహుటిన నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖపట్నానికి షిఫ్ట్ చేశారు.












Click it and Unblock the Notifications