'ఈనాడు'లో చూసి రక్తం మరిగింది: వీడియో చూపించి, బాబుపై రెచ్చిన రోజా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే, సినీ నటి రోజా శుక్రవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబు పైన తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. సస్పెన్షన్ నుంచి కాల్ మనీ సెక్స్ రాకెట్ వరకు ఆమె ఎన్నో అంశాలను ప్రస్తావించి నిలదీశారు.
ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందన్నారు. కొన్ని చానళ్లు టిడిపి ఆఫీస్ నుంచి పంపిన క్లిప్పింగ్స్ వేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఇష్టానుసారంగా తన పైన వార్తలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. అంబేడ్కర్ పైన ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో.. అసెంబ్లీ ప్రాంగణంలోని ఆయన విగ్రహం చూస్తేనే అర్థమవుతోందన్నారు.
రాజధాని విషయంలోను చంద్రబాబు ప్రభుత్వం తప్పు చేసిందన్నారు. శివరామకృష్ణ కమిటీ ప్రతిపాదన మేరకు రాజధానిని ఎక్కడ నిర్మించాలనేది ప్రజాభిప్రాయం తీసుకుంటే బాగుండేదన్నారు. కాల్ మనీ - సెక్స్ రాకెట్ విషయంలోను తాను పోరాటం చేశానని చెప్పారు.
కామ సీఎం అన్నందుకు తనను ఏడాది పాటు సస్పెండ్ చేస్తానని చెప్పడం ఎంత దుర్మార్గమో ఆలోచించాలన్నారు. జడ్జిలు, లాయర్లు, గతంలో స్పీకర్లుగా పని చేసిన వారు కూడా.. తన పైన ఏడాది పాటు సస్పెండ్ సరికాదని చెప్పారని గుర్తు చేశారు.
ఈనాడులో చూసి రక్తం మరిగింది
ఈ సందర్భంగా ఆమె ఈనాడు పేపర్లో గతంలో వచ్చిన వార్తలను చదివి వినిపించారు. 'నాయకులూ కామాంతకులే' అనే శీర్షికన ఈనాడులో వార్త వచ్చిందని, అప్పుడు తాను లండన్‌లో ఉన్నానని చెప్పారు. ఆ తర్వాత తాను తిరిగి వచ్చాక.. వార్తను చూసి తన రక్తం మరిగిపోయిందన్నారు.
దీంతో తాను సభలో సెక్స్ రాకెట్ గురించి మాట్లాడుతానని జగన్‌కు చెప్పానని, ఆయన అంగీకరించారన్నారు. ఈనాడు పత్రికలో కామ అంటూ వస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని, మరి నా పైన ఎందుకు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు.
వీడియో క్లిప్పింగ్ ప్రదర్శించిన రోజా
తాను అసెంబ్లీలో సమస్యల గురించి నిలదీస్తే అంబేడ్కర్‌ను ఉపయోగించుకొని వారు రాజకీయం చేశారని మండిపడ్డారు. తనకు తానుగా ఎలాంటి మాటలు చెప్పలేదని, టీవీలలో, పత్రికలలో వార్తలు వచ్చాయని, వాటినే తాను నిలదీశానని చెప్పారు. ఈ సందర్భంగా ఆమె టీవీలో వచ్చిన వీడియో క్లిప్పింగులను ప్రదర్శించారు. కృపారాణి అనే అమ్మాయి సెల్ఫీ వీడియో తీసుకొని కూడా పెట్టిందని, రోజా ఆ వీడియోను కూడా ప్రదర్శించారు.
వాళ్లు మనుషులా?
నీ ఫోటోలు నెట్లో పెడతామని, చంపేస్తామని బెదిరిస్తే కృపారాణి వీడియో తీసి పెట్టి చనిపోయిందన్నారు. ఇలా అమ్మాయిలు చనిపోతుంటే కూడా టిడిపి నేతలకు బాధ వేయలేదా అన్నారు. మహిళా ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారన్నారు. వారు మనుషులా అని నేను నిలదీస్తున్నానని ప్రశ్నించారు.
కుక్కలా లాక్కుపోయారు, రోజాకే ఈ పరిస్థితి వస్తే..
మేం సభలో నిలదీయడం ద్వారా కాల్ మనీ బాధితులు మరికొంతమంది బయటకు వచ్చి పోలీస్ ఫిర్యాదు చేస్తారనే ఉద్దేశ్యంతో తాను చర్చించాలనుకున్నానని చెప్పారు. సభలో రోజాకే ఇలాంటి పరిస్థితి వస్తే, మా పరిస్థితి ఏమిటనే ఉద్దేశ్యంతో కాల్ మనీ బాధితులు ఎవరూ ఫిర్యాదు చేయలేకపోయారన్నారు.
తన పైన ఏడాది సస్పెండ్ చేసిన మరుసటి రోజు తాను అడిగేందుకు స్పీకర్ వద్దకు వెళ్లేందుకు అసెంబ్లీకి వచ్చానని చెప్పారు. అప్పుడు తాను కూర్చుంటే కుక్కను లాగినట్లు లాక్కొని పోయారన్నారు. ఆ తర్వాత తను పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లారన్నారు. మార్షల్స్ తన పైన కూర్చున్నారన్నారు.

ప్రాణాలు తీసేందుకు ప్రయత్నించారంటే
తన ప్రాణాలు కూడా తీసేందుకు ప్రయత్నించారంటే వారి తీరు అర్థం చేసుకోవచ్చున్నారు. ఆ తర్వాత జగన్ స్టేషన్‌కు వచ్చి.. ఆమెకు ఏమైనా అయితే కేసులు పెడతానని, ఆసుపత్రికి తరలించాలని హెచ్చరించడంతో, అప్పుడు తనను ఆసుపత్రికి పంపించారని చెప్పారు.
ఎన్టీఆర్‌ను చంపేందుకు ఏ ముఠా అయితే ప్లాన్ చేసిందే, వంగవీటి రంగా ముఠా పైన ఏ ముఠా అయితే ప్లాన్ చేసిందే, అదే ముఠా ఇప్పుడు రోజా పైన కుట్ర చేస్తోందన్నారు. తనను రాజకీయంగా సర్వనాశనం చేసేందుకు చంద్రబాబు.. ఓ ముఠాను వాడుకుంటున్నారన్నది నిజం కాదా చెప్పాలన్నారు.
తనను ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సస్పెన్షన్ తప్పు అని కోర్టు చెబితే, మళ్లీ డివిజన్ బెంచ్‌కు వెళ్లడం విడ్డూరమన్నారు. న్యాయవ్యవస్థను గౌరవిస్తానని చెప్పే చంద్రబాబు, తమకు అనుకూలంగా తీర్పు వస్తే, ఎందుకు సభకు రాకుండా అడ్డుకున్నారని ప్రశ్నించారు.
యనమల చిన్నపిల్లాడా
340(2) రూల్ తెలియక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారని, ఆయన రూల్ తప్పు చెప్పేందుకు చిన్న పిల్లాడా అని ప్రశ్నించారు. ఆయన స్పీకర్‌గా, మంత్రిగా పని చేశారన్నారు. ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేసి సస్పెండ్ చేస్తే బాగుండేదన్నారు. స్పీకర్‌కు చెప్పేందుకు కూడా తనకు అవకాశమివ్వలేదన్నారు.












Click it and Unblock the Notifications