లోకేష్‌వి పచ్చి అబద్ధాలు: రోడ్లపై నాట్లు వేసిన రోజా!
చిత్తూరు: టీడీపీ సర్కారుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని రోడ్లను నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని రహదారుల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో ప్రభుత్వానికి తెలపడం కోసం ఆమె వినూత్న నిరసన చేపట్టారు.

రోడ్లపై నాట్లేసిన రోజా
మేళపట్టు గ్రామంలో నీటమునిగిన రోడ్డు మీద మహిళలతో కలిసి నాట్లు వేశారు. తమ గ్రామంలో రోడ్లు దారుణంగా తయారయ్యాయని, నీళ్లు నిలిచి పోయి కాలువలను తలపిస్తున్నాయని గ్రామ ప్రజలు ఫిర్యాదు చేయడంతో రోజా ఈ విధంగా నిరసన చేపట్టారు.

అధ్వాన్నంగా రోడ్లు
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. టీడీపీ అభ్యర్థిఅయిన జెడ్పీటీసీ వెంకటరత్నం సొంత గ్రామం మేళపట్టులోనే రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రహదారులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

లోకేష్‌వన్నీ పచ్చి అబద్ధాలే..
చంద్రబాబు పాలనలో రహదారులు పరమ అధ్వాన్నంగా తయారయ్యాయని రోజా విమర్శించారు. మరో మంత్రి లోకేష్ మాత్రం రాష్ట్రంలో లక్షల కిలోమీటర్ల రోడ్లు నిర్మించినట్లు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.

పట్టించుకోవడం లేదు..
గ్రామాల్లోకి వచ్చి రోడ్ల పరిస్థితి చూసే ధైర్యం టీడీపీ నేతలకు లేదని మండిపడ్డారు. జిల్లా పరిషత్ సమావేవంలో అనేకసార్లు రోడ్ల దుస్థితి గురించి మాట్లాడినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇది ఇలా ఉంటే, బుధవారం నగరిలో ఓ పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఓ వాహనంలో పెట్రోల్ కూడా నింపారు.












Click it and Unblock the Notifications