టికెట్ దక్కని ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకూ జగన్ భరోసా
YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల మలి విడత ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. తాజాగా మూడు లోక్‌సభ, 24 అసెంబ్లీ స్థానాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటించింది. 11 మందితో ఇదివరకే తొలి జాబితా విడుదలైన విషయం తెలిసిందే.
ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్ద పీట వేశారు. చోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారతే ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జగన్. మలి జాబితాలో అన్ని కులాల వారికీ ప్రాతినిధ్యం కల్పించడం విశేషం.

వివిధ కారణాల వల్ల టికెట్ దక్కని వారిని పార్టీ, నామినేటెడ్ పోస్టుల్లో నియమించి వారి సేవలను వినియోగించుకుంటామంటూ వైఎస్ జగన్ ముందు నుంచీ చెబుతూనే వస్తోన్నారు. తాను ఏ ఒక్కరిని కూడా పోగొట్టుకోదలచుకోలేదని, వారి సేవలను ఏదో ఒక రకంగా వినియోగించుకుంటాననీ స్పష్టం చేస్తోన్నారు.
తాజాగా కాకినాడలో నిర్వహించిన బహిరంగ సభలో అలాంటి సందర్భమే కనిపించింది. జిల్లాకు చెందిన శాసన సభ్యులు పెండెం దొరబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్.. కాకినాడ సభకు హాజరయ్యారు. వారిద్దరికీ టికెట్ దక్కలేదనే విషయం తెలిసిందే. పెండెం దొరబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న పిఠాపురం, ప్రత్తిపాడు స్థానాల్లో వంగా గీత, వరుపుల సుబ్బారావు నిలిపారు జగన్.

టికెట్ దక్కలేదని ఆవేదన, అసంతృప్తి వారిద్దరిలోనూ ఉంది. అయినప్పటికీ- కాకినాడ సభకు హాజరయ్యారు. వైఎస్ జగన్‌తో కలిసి బహిరంగ సభను పంచుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారిని బుజ్జగించారు. ఏదో ఒకరకంగా న్యాయం చేస్తానని, సేవలను ఉపయోగించుకుంటానని అన్నారు. ఇద్దరితో కలిసి ఫొటో దిగారు.












Click it and Unblock the Notifications