ఆ నియోజకవర్గంలో మకాం వేసిన తోట త్రిమూర్తులు: సీటు ఖరారు కాకముందే..
Thota Trimurthulu: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక, కొత్త ఇన్‌ఛార్జీల నియామకాలు, రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించింది. ఇంకో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పులు మున్మందు మరిన్ని సంచలనాలను తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజాగా రెండో జాబితాపై దాదాపుగా సిద్ధమైనట్టే. మొత్తంగా 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ మార్పులు ఉండొచ్చు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాల్లో ఈ మార్పులు చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. ఈ జాబితా ఈ సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది.

సంక్రాంతి నాటికి మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాల తుది జాబితాను విడుదల చేయాలనే పట్టుదలతో ఉంది వైఎస్ఆర్సీపీ. ఈ దిశగా కసరత్తు ముమ్మరం చేసింది. రెండో జాబితా వెలువడిన వెంటనే ఆ తరువాతి నియోజకవర్గాలపైనా దృష్టి పెడుతుందని, వారం- 10 రోజుల్లో పూర్తి జాబితా వెలువడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యుడు తోట త్రిమూర్తులు వార్తల్లోకెక్కారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గంలో తోట పృథ్వీరాజ్‌తో కలిసి విస్తృతంగా పర్యటించారు. ప్రజలను ముఖాముఖిగా కలుసుకున్నారు. వారు ఎదుర్కొంటోన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

పట్టణంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను తోట త్రిమూర్తులు పరిశీలించారు. మండపేట ద్వారపూడి రోడ్డు నిర్మాణ పనుల గురించి ఆరా తీశారు. రోడ్డు నిర్మాణ పురోగతిని స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేయాల్సి ఉంటుందని సూచించారు.
మండపేట నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్‌ఛార్జీగా తోట త్రిమూర్తులు నియమితులు అయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వస్తోన్న సమయంలో ఆయన ఇదే పట్టణంలో పర్యటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ- ఇక్కడి నుంచే పోటీ చేస్తారనే ప్రచారానికి మరింత బలాన్ని ఇచ్చినట్టయింది.












Click it and Unblock the Notifications