సీబీఐకి కల్తీ మద్యం కేసు ? అమిత్ షాను కోరిన వైసీపీ ఎంపీ..!
ఏపీలోని అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బయటపడ్డ కల్తీ మద్యం కేసు చినికిచినికి గాలివానగా మారుతోంది. ఈ వ్యవహారంతో ప్రమేయమున్న ఇద్దరు టీడీపీ నేతల్ని చంద్రబాబు సస్పెండ్ చేయడం, పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపడంతో ఇది కాస్తా విపక్ష వైసీపీకి అస్త్రంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన వైసీపీ.. ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది.
రాష్ట్రంలో తాజాగా బయటపడిన కల్తీ మద్యం తయారీ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఇవాళ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఏపీలో కల్తీ మద్యం తయారీ, పంపిణీపై వెంటనే జోక్యం చేసుకుని సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని మిథున్ రెడ్డి ఈ లేఖలో కోరారు. ఈ కల్తీ మద్యం రాకెట్ భారీ స్థాయికి విస్తరించిందని, ఇది ఇతర రాష్ట్రాలకు సైతం విస్తరించిందని, దీన్ని స్థానిక సమస్యగా చూడొద్దని అమిత్ షాను కోరారు.

మిథనాల్ వంటి విషపూరిత రసాయనాలతో తయారు చేసిన నకిలీ మద్యం మానవ ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని ఎంపీ మిధున్ రెడ్డి తన లేఖలో హెచ్చరించారు. కల్తీ మద్యం వల్ల ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాలలో అనేక విషప్రయోగం, మరణాలు నమోదయ్యాయని, ప్రముఖ బ్రాండ్ల లేబుళ్ల క్రింద విక్రయించే నకిలీ బాటిళ్ల వల్ల పేదలు ఎక్కువగా బాధితులవుతున్నారని ఆయన తెలిపారు. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ తనిఖీల్లో తన నియోజకవర్గంలోని అన్నమయ్య జిల్లాలోని ములకలచెరువులో ఒక యూనిట్ సహా ఇతర ప్రాంతాల్లోనూ వీటి తయారీని గుర్తించారన్నారు.

ప్రాథమిక దర్యాప్తులో జిల్లాలు మరియు రాష్ట్ర సరిహద్దుల్లో విస్తరించి ఉన్న వ్యవస్థీకృత నెట్‌వర్క్‌కు సంబంధాలు ఉన్నాయని తేలిందన్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, రాష్ట్ర పోలీసులు, ఎక్సైజ్, సీబీఐసీ, FSSAI ప్రమేయంతో సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని వైసీపీ ఎంపీ అమిత్ షాను కోరారు. పారిశ్రామిక మద్యంపై కఠిన పర్యవేక్షణ, చట్టవిరుద్ధ ప్రయోజనాల కోసం దానిని మళ్లించడాన్ని నిరోధించడం, నకిలీ మద్యం మాఫియాను సమర్థవంతంగా నిర్మూలించడానికి రాష్ట్రాల మధ్య మెరుగైన నిఘా భాగస్వామ్యం అవసరాన్ని కూడా ఆయన గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications