మూసేసుకుంటారా?: టీడీపీ నేతలకు వైసీపీ ఎంపీ విసిరిన సవాల్ ఇదే
అమరావతి: గెలిచే సత్తా ఉంటే రాజీనామా చేసి ఎన్నికల్లో మళ్లీ గెలవాలని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సవాల్ విసిరారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నుంచి గెలిచి ఆ పార్టీనే విమర్శించడం ఎంత వరకు సమమజసం అంటూ పార్టీని వీడి టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యేలను ప్రశ్నించారు.
ఫిరాయించిన ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారామని అంటున్నారని ఈ సందర్భంగా గుర్తు చేసిన ఆయన రాష్ట్రంలో రెండేళ్ల కాలంలో చంద్రబాబు హయాంలో ఏం అభివృద్ధి జరిగిందో, ఎక్కడ జరిగిందో చెప్పాలని ఎమ్మెల్యేలను నిలదీశారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానంలో తమ పార్టీకి చెందిన అభ్యర్ధులు గెలిస్తే, టీడీపీని మూసేసుకుంటారా? అని ఆ పార్టీ నేతలకు సవాల్ విసిరారు. మరోవైపు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతుందంటూ కడపలో బుధవారం వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది.
ఈ ర్యాలీలో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, శ్రీనివాసులు, అంజాద్ బాషా, శ్రీకాంత్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి, మేయర్ సురేష్ బాబు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన వైసీపీ నేతలు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
అవినీతిపై పోరాడుతున్నందుకే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, జిల్లా అధికారులు ప్రొటోకాల్ ను పాటించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులను, ప్రొటోకాల్‌ను పక్కనబెట్టి ఓడిపోయిన వారితో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రారంభిస్తున్న జిల్లా అధికార యంత్రాంగం తీరుకు నిరసనగా ఈ ర్యాలీ చేపట్టారు.












Click it and Unblock the Notifications