టీడీపీ ఎప్పుడొచ్చినా మాకు టార్చరే? వైసీపీ ఎంపీ షాకింగ్..!
ఏపీలో గతేడాది అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి కూటమి సర్కార్ చుక్కలు చూపిస్తోంది. తాజాగా మద్యం కుంభకోణంతో పాటు ఇతర కేసుల్లోనూ వైసీపీ నేతల్ని వరుసగా అరెస్టులు చేస్తూ జైల్లోనూ ఇబ్బందులు పెడుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇవాళ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి జైల్లో తనను ఎంతగా టార్చర్ పెట్టారో ఆయన వివరించారు.
తెలుగదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా తప్పుడు కేసులు పెట్టడం అలవాటేనని మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అసమర్థతపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిన ప్రతిసారీ, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు సంబంధం లేని అంశాలను ముందుకు తెచ్చి అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. ఇటువంటి చర్యలతో భయపెట్టాలనుకోవడం వారి అవివేకమన్నారు. కేసుల్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామన్నారు.

కోర్టు తనకు బెయిల్ సందర్భంగా ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న అంశాలు నూటికి నూరుశాతం వాస్తవమన్నారు. వాటిని చదివితే ప్రజలకు తనపై నమోదైన కేసుకు సంబంధించిన నిజాలు అర్థమవుతాయన్నారు. కోర్ట్ ఉత్తర్వుల ప్రకారం తనపైపెట్టిన కేసుకు సంబంధించి ప్రత్యేకంగా మాట్లాడలేకపోతున్నట్లు తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగా ఎటువంటి ఇబ్బందులు పెట్టినా, భయపడేది లేదన్నారు. అన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్దమన్నారు.
ఎప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చినా ఇదే తరహాలో కేసులతో వేధించడం వారికి మామూలేనన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో తనతో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బియ్యపు మధుసూధన్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారన్నారు. తాను ఇంజనీరింగ్ చదివే సమయంలో తనపైన మొట్టమొదట కేసు పెట్టింది కూడా టీడీపీ ప్రభుత్వమే అన్నారు. తాజాగా లేని లిక్కర్ స్కాంలో జైలుకు పంపినా కూడా జగన్ తో పాటు వైసీపీ శ్రేణులు అండగా నిలిచారన్నారు. తనపై పెట్టిన కేసు ద్వారా కూటమి నేతలు పైశాచిక ఆనందం పొందడం తప్ప సాధించింది ఏమీ లేదని, తన తల్లిదండ్రులను క్షోభపెట్టడం తప్ప ఒరిగింది ఏమీ లేదన్నారు.

రాజమండ్రి జైల్లో తనను తీవ్రవాదిని చూసినట్లుగా పట్ల వ్యవహరించారన్నారు. తనను ఉంచిన బ్లాక్‌లో మరో వ్యక్తి లేకుండా చూశారన్నారు. కేవలం ములాఖాత్‌ల సమయంలో, లేదా ఇంటికి మూడు ఫోన్ కాల్స్ చేసుకునే అవకాశం తప్ప మరొకటి లేకుండా చేశారన్నారు. అంతేకాదు మొత్తం తన కదలికలపై ఇరవై నాలుగు గంటలు పరిశీలించేందుకు నిఘా కోసం సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారన్నారు. ఆ కెమెరా ఫుటేజీని ఎవరు చూస్తున్నారో తెలియదన్నారు. విజయవాడలో కూర్చుని కూడా ఆ ఫుటేజీని చూసే అవకాశం ఉందని తెలుసన్నారు. జైలు అధికారులు సైతం తనతో మాట్లాడేందుకు భయపడ్డారన్నారు.












Click it and Unblock the Notifications