నిన్న షాకిచ్చిన వైసీపీ ఎంపీకి ఇవాళ సీఆర్పీఎఫ్ భద్రత-కేంద్రం కీలక నిర్ణయం...!
ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడ్డాక మారిన పరిస్ధితుల్లో వైసీపీ, బీజేపీ బంధం పూర్తిగా తెగిపోయింది. గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర, రాష్ట్ర సంబంధాల పేరుతో ఎన్డీయే సర్కార్ కు అండగా ఉన్న వైఎస్ జగన్.. తాజాగా దానికి గుడ్ బై చెప్పేశారు. అంతే కాదు కేంద్రం పార్లమెంటులో పెట్టిన వక్ఫ్ బిల్లును సైతం వ్యతిరేకించారు. తద్వారా ఇండియా కూటమివైపు ఆయన అడుగులేస్తున్నట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఓ వైసీపీ ఎంపీకి
కేంద్ర హోంశాఖ సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడైన పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి వరుసగా మూడోసారి రాజంపేట ఎంపీగా గెలిచారు. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో గతంలో తమ కంచుకోటగా ఉన్న పుంగనూరులోనే ఇప్పుడు గడ్డు పరిస్ధితులు ఎదుర్కొంటున్నారు. పుంగనూరులో అడుగుపెడితే చాలు టీడీపీ శ్రేణులు ఆయన్ను టార్గెట్ చేస్తూ దాడులకు దిగుతున్నాయి. దీంతో ఆయన తనకు భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖను కోరారు.

మిథున్ రెడ్డి వినతిపై స్పందించిన కేంద్ర హోంశాఖ నిఘా వర్గాల నుంచి నివేదిక తెప్పించుకుని అనంతరం సీఆర్పీఎఫ్ భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మిథున్ కు కూడా సమాచారం ఇచ్చింది. ప్రత్యర్థుల నుంచి మిథున్ రెడ్డికి ఉన్న హాని నేపథ్యంలో.. నిరంతరాయంగా సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం తీసుకుంది. మరోవైపు నిన్న లోక్ సభలో కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లును వైసీపీ తరఫున మిథున్ రెడ్డి వ్యతిరేకించారు. అయినా హోంశాఖ నిబంధనల మేరకు మిథున్ రెడ్డికి సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం.












Click it and Unblock the Notifications