మరో వైసీపీ ఎంపీ రాజీనామా- రాజ్యసభ ఛైర్మన్ నోటిఫికేషన్.. !
వైసీపీ అధికారంలో ఉండగా రాజ్యసభ ఎంపీలుగా నామినేట్ అయిన వారంతా ఇప్పుడు వరుసగా తమ పదవులు వదులుకుంటున్నారు. ముఖ్యంగా వైసీపీ అధికారం కోల్పోయాక ఆ పార్టీని వీడుతున్న రాజ్యసభ సభ్యుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాల్ని రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించారు. ఇవాళ మరో ఎంపీ రాజీనామాను ఆమోదిస్తూ ఛైర్మన్ నోటిఫికేషన్ విడుదల చేశారు.

ఇప్పటికే వైసీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వీటిని రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించడంతో ఈ రెండు సీట్లు ఖాళీ అయ్యాయి. నిన్న మరో వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య కూడా తన పదవిని వదులుకున్నారు. ఇంకా నాలుగేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ ఆయన తన పదవిని వదులుకున్నారు. ఆయన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ ఆమోదించడంతో వైసీపీ నుంచి మూడో ఎంపీ రాజీనామా ఆమోదం పొందినట్లయింది. వైసీపీకి రాజ్యసభలో మొత్తం 11 మంది ఎంపీలు ఉండగా.. ఇందులో ముగ్గురు రాజీనామాలు చేశారు.
మరోవైపు వైసీపీకి ఇప్పటికే గుడ్ బై చెప్పడంతో పాటు రాజ్యసభ ఎంపీ పదవులు కూడా వదులుకున్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఇప్పటివరకూ ఏ పార్టీలో చేరలేదు. ఆర్ కృష్ణయ్య కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన మాత్రం ఇప్పటివరకూ దీనిపై నోరు విప్పలేదు. ప్రస్తుతానికి మోపిదేవి, బీద తరహాలోనే ఆయన కూడా మౌనంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications