రఘురామ కాలికి ఫ్రాక్చర్- సుప్రీంకు ఆర్మీ ఆస్పత్రి నివేదిక-ఆయనే చేసుకున్నారన్న సీఐడీ
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, రఘురామరాజు తరఫున మరో సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తున్నారు. రఘురామరాజు శరీరంపై గాయాల నిర్ధారణ కోసం సుప్రీం ఆదేశాల మేరకు వైద్య పరీక్షలు నిర్వహించిన సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి తన నివేదిక ఇచ్చింది. ఇందులో రఘురామ కాలికి గాయం అయినట్లు డాక్టర్లు సుప్రీంకు నివేదించినట్లు తెలుస్తోంది.

రఘురామ బెయిల్‌పై విచారణ
సుప్రీంకోర్టులో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత విచారణ ప్రారంభం కాగానే రఘురామరాజు, ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తన వాదనలు వినిపించడం మొదలుపెట్టారు. అయితే ముందుగా సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి డాక్టర్లు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికను అత్యున్నత న్యాయస్దానానికి అందించారు. ఈ నివేదిక రఘురామ బెయిల్ అభ్యర్ధనలో కీలకంగా మారింది.

రఘురామ కాలికి ఫ్రాక్చర్
రఘురామరాజు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై ఇవాళ విచారణ ప్రారంభించిన సుప్రీంకోర్టు.. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన సీల్డ్ కవర్ నివేదిక తమకు అందినట్లు ప్రకటించింది. ఇందులో రఘురామ కాలికి గాయమైనట్లు ఆర్మీఆస్పత్రి డాక్టర్లు సుప్రీంకోర్టుకు నివేదిక ఇచ్చారు. దీంతో రఘురామ కాలికి గాయాల వ్యవహారం మరో మలుపు తిరిగింది. గతంలో ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు వైద్య పరీక్షలు నిర్వహించిన గుంటూరు జీజీహెచ్ డాక్టర్లు గాయాలేవీ లేవని, ఆయనకు సొరియాసిస్ ఉందని నివేదిక ఇచ్చారు. దీంతో ఇప్పుడు ఆర్మీ డాక్టర్ల నివేదిక సంచలనం రేపుతోంది.

తానే గాయం చేసుకున్నారన్న సీఐడీ
రఘురామరాజు కాలికి గాయం ఉందని సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి డాక్టర్లు ఇచ్చిన నివేదికపై సీఐడీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. రఘురామరాజు తానే కాలికి గాయం చేసుకుని ఉండొచ్చని సీఐడీ న్యాయవాదులు తెలిపారు. గతంలో ఆయన కాలికి గాయమే కాలేదని గుంటూరు జీజీహెచ్ వైద్యులు నివేదిక ఇచ్చినప్పుడు స్పందించని సీఐడీ ఇప్పుడు రఘురామ తానే స్వయంగా గాయం చేసుకుని ఉండొచ్చని చేస్తున్న వాదన ఈ కేసులో మరో ట్విస్ట్‌గా మారింది.

రఘురామను చిత్రహింసలు పెట్టారన్న ముకుల్ రోహత్గీ
రఘురామ గాయాన్ని సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి నిర్ధారించిన నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ సుప్రీంకోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీపై చిత్రహింసలు నిజమేనని నివేదిక చెబుతోందని, ఓ ఎంపీకే ఇలా ఉంటే సామాన్యుల పరిస్ధితి ఏంటని ప్రశ్నించారు. రఘురామకు వెంటనే బెయిల్ మంజూరు చేయాలని, దీనిపై సీబీఐ విచారణ కూడా జరపాలని ఆయన కోర్టును కోరారు. దీంతో సీఐడీ న్యాయవాదులు రఘురామ గాయంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

రఘురామ గాయంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
రఘురామ గాయాలపై ఆర్మీ డాక్టర్లు ఇచ్చిన నివేదికపై స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం... ఆయనకు ముగ్గురు డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారని, ఎక్స్‌రే, వీడియో కూడా పంపారని, రఘురామకు జనరల్ ఎడీమా ఉందని తెలిపింది. ఫ్రాక్చర్ కూడా ఉందని నివేదికలో ఉందని ధర్మాసనం వివరించింది. మేం ఎంపీయా, సామాన్యుడా అని చూడం, పిటిషనర్ ఎవరైనా మా దృష్టిలో ఒక్కటే అని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో ఈ కేసులో తామెంత సీరియస్‌గా ఉన్నామో సుప్రీంకోర్టు మరోసారి చెప్పినట్లయింది.












Click it and Unblock the Notifications