మోదీపై జగన్ తిరుగుబాటు: రహస్యం ఇదేనన్న ఎంపీ రఘురామ -వైసీపీని చంపేస్తోన్న సీఎం అంటూ
''ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేస్తోంది..'' అంటూ వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతుండటం, దానికి కౌంటర్ గా జగన్ బెయిల్ రద్దు అంశాన్ని ప్రస్తావిస్తోన్న బీజేపీ నేతలు.. మీ గొయ్యి మీరే తీసుకున్నారని వైసీపీపై ఎదురుదాడి చేస్తున్నారు. ఎన్డీఏ మిత్రులు సైతం ఛీపొమ్మన్నా, బీజేపీకి, ప్రధాని మోదీకి అన్ని విధాలుగా మద్దతిస్తోన్న జగన్ ఒక్కసారిగా రివర్స్ స్ట్రాటజీని ఎత్తుకోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే అంశంపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం పదునైన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, మోదీపై జగన్ తిరుగుబాటుకు కారణాలివేనని చెప్పారు. ఎంపీ రఘురామ ఏమన్నారో ఆయన మాటల్లోనే...

జగన్ కూల్చివేతకు మోదీ కుట్రా?
''ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. అప్పుల గురించి ప్రశ్నలడితే అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. గురివింద గుంజ సామెతను కూడా చెప్పారాయన. అప్పులు చేయడం తప్పుకాదు కానీ తప్పుగా అప్పులు చేయడమే తప్పు అని నేను గతం నుంచీ వాదిస్తూ వస్తున్నాను. కేంద్రం చేయట్లేదా అప్పు.. మేం చేస్తే ఏంటి తప్పు? అని మంత్రి నాని ప్రశ్నించారు. మరి అదే అప్పుల లెక్కలను ఆడిట్ చేస్తామని కేంద్రం అంటోంటే, ఎఫ్ఆర్బీఎం పరిధి దాటేశారని, కార్పొరేషన్ల ద్వారా తప్పుడు పద్దతుల్లో అప్పులు తెచ్చారని ఆరోపణలొస్తే, దానిపై విచారిస్తామని కేంద్రం నుంచి లేఖ వస్తే.. వైసీపీ నేతలు వక్రభాష్యలు చెబుతున్నాను. ఇది జగన్ సర్కారును కూల్చేయడానికి మోదీ సర్కారు చేస్తోన్న కుట్ర అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

జరుగుబాటు లేకే తిరుగుబాటు..
జగన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి బీజేపీ వాళ్లు కుట్రలు చేస్తున్నారని మంత్రి నాని చెప్పిన విధానాన్ని బట్టి కేబినెట్ సమావేశంలోనూ దీనిపై చర్చ జరగి ఉండొచ్చు. కేంద్రంపై తిరుగుబాటు చేయాలనేదే కేబినెట్ నిర్ణయం కూడా కావొచ్చు. అయితే ఇక్కడ సీఎంకు నేనొక విషయం చెప్పదలిచాను.. అయ్యా.. మీ జరుగుబాటుకు కష్టం అవుతోంది కాబట్టి కేంద్రంపై తిరుగుబాటు చేయడం కరెక్ట్ కాదు. తెలిసి చేసినా, తెలియక చేసినా అప్పుల వివరాలు ఇవ్వండి.. నిజంగానే మనం దొరికిపోయినా కొద్ది రోజుల ఇబ్బంది తప్ప ఏమీ కాదు. ఏపీలో అప్పులపై ఒక శ్వేతపత్రమైనా విడుదల చేయొచ్చు. తద్వారా ప్రజల బాగు కోసమే అప్పులు చేశారన్న జగన్ విశాల హృదయం ఏమిటో అందరికీ తెలుస్తుంది.

రఘురామ లేఖతోనే కేంద్రం కదలిక..
అద్దెకుండే వాడు ఇల్లు అమ్మబోతే యజమాని అడ్డం పడిన కార్టూన్ ఒకటి ఏపీలో తెగ వైరలైంది. ఐదేళ్లకు ఓటేసిన వాడు రాష్ట్రాన్ని అమ్ముకుంటోంటే జనం చూస్తూ కూర్చోలేదా? అన్నది ఆ కార్టూన్ ఉద్దేశం. అమ్మా.. అయ్యా.. అని జనాన్ని ఓట్లు అడుక్కుంటే మనం గెలిచాం. అలాంటిదిప్పుడు కలెక్టర్ ఆఫీసులను, తాగుబోతులను 20 ఏళ్లకు తాకట్టుపెట్టేస్తారా? ప్రభుత్వ ఆస్తుల్ని శాశ్వతంగా అమ్మేస్తారా? ఇదేంటని అడిగినవాళ్లను తొక్కేస్తారా? ప్రశ్నించే గొంతుల్ని నొక్కేస్తారా? ఏపీ ఆర్థిక దుస్థితిపై, తలకు మించిన అప్పులపై ప్రధాని నరేంద్ర మోదీకి నేను రాసిన లేఖలకు స్పందన వచ్చిందని, ఏపీ అప్పుల లెక్కలపై కేంద్రం విచారణకు సిద్ధమవుతోంది..

అప్పుల విషయం మోదీకి చెప్పలేదా?
ఏపీ అప్పులపై కేంద్రం.. అకౌంటెంట్ జనరల్ చేత దర్యాప్తు చేయించబోతున్నదని అన్ని ప్రముఖ పేపర్లలో వార్తలు వచ్చాయి. అప్పుల లెక్కలపై జగన్ ప్రభుత్వం చెప్పే లెక్కలతోపాటు దొంగ అప్పులు ఏవైనా ఉన్నాయా అని కూడా కేంద్ర బృందాలు ఆరా తీయబోతున్నాయి. ఏపీలోని జగన్ సర్కారు ఏ చిన్న పని చేసినా కేంద్రంలోని మోదీ సర్కారుకు చెప్పిన తర్వాతే చేస్తామని వైసీపీ నేత విజయసాయిరెడ్డి పదే పదే చెప్పేవారు. మరి తప్పుగా చేసిన ఈ అప్పుల గురించి కేంద్రానిక చెప్పలేదా? ఒకవేళ చెప్పి చేసినా మళ్లీ ఎంక్వైరీలు ఏంటని కోపమా? కేంద్రంతో సఖ్యంగా మెలగాల్సిన వైసీపీ ఇవాళ ఈ స్థాయిలో ఫ్రస్ట్రేట్ అవుతోంది ఎందుకు?

పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి..
కేంద్రంతో జాగ్రత్తగా ఉండాలని జగన్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి, కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, రాజ్యాంగ నియమాలను పాటిద్దామని కోరుతున్నా. పక్కనే మత గ్రంధం పెట్టుకున్నప్పటికీ జగన్ ప్రమాణం చేసింది రాజ్యాంగం మీదనే కదా, అప్పుల లెక్కలు చూపాలని కేంద్రం అడుగుతున్నది కూడా ఆ రాజ్యంలోని అంశాల ప్రాతిపదికగానే కదా, మరి విచారణకు జగన్ ప్రభుత్వం ఎందుకు భయపడుతోంది? సమాధానం చెప్పకుండా, కేంద్రం అప్పు చేయట్లేదా అని ప్రశ్నించడమేంటి? దయచేసి ఈ విధానాలు మంచిది కావు, రాజ్యాంగ విరుద్ధంగా వెళితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. కేంద్రం రాజ్యంగ బద్ధంగానే అప్పులు చేస్తుంది. అందులో ఏవైనా లోపాలుంటే మీరు చెప్పండి..

జగన్ ఫ్యామిలీ కోసమే అమరరాజా తరలింపు?
అభివృద్ధికి సంబంధించి కొత్త పనులు చేయకపోగా, ఉన్న సంస్థలను చెత్త కారణాలు చూపించి వెళ్లగొట్టాలనుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలోని అమరరాజ బ్యాటరీస్ సంస్థ పట్ల ఏం జరుగుతోందో చూస్తున్నాం. జగన్ కుటుంబానికి చెందిన వ్యక్తులు బ్యాటరీల వ్యాపారంలోకి వస్తుండటంతో వాళ్లకు అడ్డు లేకుండా ఉండేందుకే అమరరాజాను వెళ్లగొడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అనుమానాలు నిజమైతే అతి పార్టీకి అప్రతిష్ట. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నో మంచి మాటలు చెప్పిన జగన్.. ముఖ్యమంత్రిగా విరుద్ధమైన తీరును అనుసరిస్తున్నారు. వైసీపీ అధినేతగా జగన్ చెప్పిన మాటలు వినే జనం ఓట్లేశారు. ముఖ్యమంత్రిగా జగన్ వైసీపీని చంపొద్దని కోరుతున్నాను. అమరావతిలో రైతుల నిరసనలు 600 రోజుకు చేరిన సందర్భంగా ఉద్యమ నేతలు ఒక పాటను నాతో విడుదల చేయించారు. అమరావతిలో ఆ కట్టడాల నిర్మాణాలు ఆపేసి, పలు సంస్థలకు రూ.2600 కోట్ల బకాయిలు పెట్టారు, రోడ్లు, ప్రాజెక్టులన్నీ కలిపి రూ.90వేల కోట్ల బకాయిలు ఉన్నాయి. మరి కొత్తగా తీసుకొస్తున్న అప్పులు అభివృద్ధి కోసం ఖర్చు చేసి ఉంటే ఉపాధి అవకాశాలు పెరిగేవి కదా..'' అని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు.












Click it and Unblock the Notifications