లోకేష్ కోసం పవన్ క్రెడిబులిటీ దెబ్బతీస్తున్న చంద్రబాబు? సాక్ష్యంతో సాయిరెడ్డి ట్వీట్..
ఏపీలో గత ఐదేళ్లుగా విపక్షంలో ఉన్న చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ ను ట్వీట్లతో టార్గెట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక తొలినాళ్లలో సైలెంట్ గా ఉన్నా తాజాగా మరోసారి స్వరం పెంచారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ను అడ్డుపెట్టి చంద్రబాబు, లోకేష్ ను టార్గెట్ చేసేలా సాయిరెడ్డి ట్వీట్లు పెడుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఆయన మరో ట్వీట్ పెట్టారు. ఇందులో పవన్ విశ్వసనీయతను చంద్రబాబు ఎలా దెబ్బతీస్తున్నారో వివరించారు.
పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారుల్ని టార్గెట్ చేస్తూ సీఎం చంద్రబాబు తాజాగా చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. అందులో ఆయన పవన్ కళ్యాణ్ శాఖల అధికారులపై విరుచుకుపడటం ద్వారా చంద్రబాబు .. డిప్యూటీ సీఎం విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ఎలా ప్రయత్నిస్తున్నారో వివరించారు.

చంద్రబాబు తన కపట ట్రేడ్‌మార్క్ రాజకీయ క్రీడలకు తిరిగి వచ్చాడంటూ ట్వీట్ మొదలుపెట్టిన విజయసాయిరెడ్డి.. పవన్ కళ్యాణ్ శాఖల అధికారులపై పరుష పదజాలంతో విమర్శలు చేయడం ద్వారా చంద్రబాబు చాకచక్యంగా నిందను పవన్ కళ్యాణ్‌పైకి నెట్టి, ఆయన విశ్వసనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. 2014, 2024 ఎన్నికలలో విజయాలు సాధించేందుకు పవన్ కళ్యాణ్ ప్రజాదరణను వినియోగించుకున్న చంద్రబాబు.. ఇప్పుడు అదే నాయకుడి ప్రతిష్టను దిగజార్చేందుకు పక్కాగా వేసిన ఎత్తు ఇది అని అభివర్ణించారు.

ఇది చంద్రబాబు క్లాసిక్ స్టైల్ అంటూ సాయిరెడ్డి అభివర్ణించారు. ఇది ఇప్పుడు తన కుమారుడికి ముప్పుగా భావిస్తున్న ఎదుగుదల శక్తిని అణిచివేసేందుకు ఒక తెగింపు పన్నాగం అంటూ మరో ఎత్తుకు దీన్ని తీసుకెళ్లారు. సింహాసనానికి అవకాశం లేని లేదా దాదాపు అసాధ్యమైన అవతారం అంటూ లోకేష్ పైనా విమర్శలు గుప్పించారు. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య అగాధం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న విజయసాయిరెడ్డిపై నిఘా పెట్టాలని టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications