రాహుల్ యాత్రపై సాయిరెడ్డి సెటైర్లు- తెలుగునాడే అర్ధం కాలేదు దేశాన్నెలా ? కాళ్లు నొప్పులు తప్ప..
దేశంలో బీజేపీ సాగిస్తున్న విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ఈ నెల 7నుంచి భారత్ జోడో యాత్ర చేపట్టబోతున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ సాగే ఈ 3500 కిలోమీటర్ల యాత్ర ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొన్నిరోజులుగా ఈ యాత్రను టార్గెట్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఇవాళ కూడా ఫేస్ బుక్ లో రాహుల్ యాత్రపై సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
Recommended Video

జగన్ కాంగ్రెస్ వీడుతుంటే మౌనం
సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో' పేరుతో దేశ పర్యటనకు బయల్దేరుతున్నారని, సంక్షోభ సమయాల్లో తెగువ చూపించాల్సిన నెహ్రూ-గాంధీ కుటుంబ వారసుడు పలుమార్లు వెన్నుచూపారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు.
పుష్కరకాలం కిందట 2010లో అప్పటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేతలు అధికార గర్వంతో కడప ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని, తన నాయనమ్మ ఇందిరమ్మను మెదక్ నుంచి పార్లమెంటుకు పంపిన తెలుగు ప్రజల మనోభావాలను అప్పుడు యువరాజు రాహుల్ పట్టించుకోలేదన్నారు.
కాంగ్రెస్ పార్టీకి, కడప లోక్‌సభ సీటుకు రాజీనామా చేసిన జగన్ మోహన్ రెడ్డిని పార్టీ వీడకుండా నివారించే ప్రయత్నం చేయలేదు ప్రధాని పీఠానికి ‘నిరంతర వారసుడు' రాహుల్. మనకెందుకన్నట్టు ఆయన హస్తినలో నోరుమూసుకుని కూర్చున్నారన్నారు. ఆంధ్ర ప్రజానీకం ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నించనే లేదన్నారు.

చంద్రబాబుతో లాలూచీ
ఏపీలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ‘నిలబెట్టడానికి' ప్రతిపక్షమైన తెలుగుదేశం పరోక్ష మద్దతు తీసుకోవడానికి కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం సిద్ధపడిందని విజయసాయి విమర్శించారు. ఇదే క్రమంలో మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో లాలూచీ పడిందన్నారు. జనబలంతో తండ్రి బాటలో ముందుకు సాగుతున్న జగన్ పై సీబీఐ కేసులు బనాయించి తెలుగునాట కాంగ్రెస్ పార్టీ మరణానికి మంచి పునాది వేసిందన్నారు. సరే, గతాన్ని ఎవరూ మార్చలేరన్నారు.

వైఎస్సార్, జగన్ పాదయాత్రలు
తన 2003 పాదయాత్ర ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత జననేత వైఎస్ రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని సాయిరెడ్డి తెలిపారు. ఆయన కంటే 20 ఏళ్ల ముందు నాటి జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ నాలుగు నెలల పాటు కన్యాకుమారి నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేశారు గాని ఆయనకు ప్రధాని పదవి 1984 డిసెంబర్ ఎన్నికల్లో దక్కలేదన్నారు. ఇందిర దారుణ హత్య ఈ పాదయాత్రకు ఫలితం లేకుండా చేసిందన్నారు. పాదయాత్రల ద్వారా ప్రజలను చైతన్యపరచాలనే లక్ష్యంతో వందలాది కిలోమీటర్లు నడిచిన రాజన్న, జగనన్న- ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారని సాయిరెడ్డి తెలిపారు. ప్రజాసంక్షేమానికి పునరంకితమయ్యే అవకాశాలు పొందారన్నారు.

రాహుల్ కు కాళ్ల నొప్పులే
మరి ఇప్పుడేమో, ‘భారత్ జోడో' (భారతీయులందరినీ ఏకం చేయాలనే పిలుపుతో) ఈ నెల 7న రాహుల్ చేపట్టబోయే పాదయాత్రపై అత్యధిక ప్రజానీకానికి గొప్ప అంచనాలేవీ లేవని సాయిరెడ్డి విమర్శించారు. నేరుగా జనం మధ్య తిరుగుతూ, వారితో మమేకమయ్యే స్వభావం లేని ఈ ‘శాశ్వత యువరాజు' భారత ప్రజలను చైతన్యపరిచి హస్తం బలోపేతం కావడానికి ప్రయత్నిస్తారంటే- నమ్మబుద్ధి కావడం లేదని ఎద్దేవా చేశారు. 12 ఏళ్ల క్రితం తెలుగు జనం మనోభావాలు అర్ధంచేసుకోలేని రాహుల్ ‘భయ్యా' ఇప్పుడు వేల కిలోమీటర్లు నడిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చేది అధికారం కాదు. ఆయన కాళ్లకు నొప్పులు మాత్రమేనన్నారు












Click it and Unblock the Notifications