ప్రత్యేక హోదాపై కేంద్రం వివక్ష-రాజ్యసభలో విజయసాయిరెడ్డి ఫైర్-రుణపరిమితి పెంపుకు వినతి
ఏపీకి ప్రత్యేక హోదా కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ మరోసారి మండిపడ్డారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో మాట్లాడిన సాయిరెడ్డి... కేంద్రం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముందుగా ఏపీ ప్రభుత్వం, వైసీపీ తరఫున రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన ఎంపీ విజయసాయిరెడ్డి ఆ తర్వాత రెండు విషయాల్ని రాజ్యసభలో ప్రస్తావించారు. ఇందులో ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు అప్పులు తెచ్చుకునే పరిమితుల్లో కోతలు విధించడం ఉన్నాయి. ముందుగా ప్రత్యేక హోదాపై మాట్లాడిన విజయసాయిరెడ్డి... ఏపీలో విపక్షాలు తాము ప్రత్యేక హోదాపై పార్లమెంటులో మాట్లాడటం లేదని ఆరోపణలు చేస్తున్నట్లు గుర్తుచేశారు. ఇప్పటికే ఏడుసార్లు ప్రధాని మోడీకి సీఎం జగన్ ప్రత్యేక హోదాపై విజ్ఢాపనలు ఇచ్చారని తెలిపారు. ప్రత్యేక హోదా నిరాకరించేందుకు కేంద్రం చెప్తున్న ఆరు కారణాలు సహేతుకంగా లేవన్నారు. ఒడిశా, బీహార్ వంటి రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయని చెప్తున్నారని, తమకు ఇస్తూ వాటికి కూడా ప్రత్యేక హోదా ఇస్తే తమకెలాంటి అభ్యంతరం లేదన్నారు. ఈ సందర్భంగా ఏపీని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ, ఎంపీ జైరాం రమేష్ ను సైతం సాయిరెడ్డి పదే పదే తప్పుబట్టారు.

బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ కు ప్రత్యేక హోదా ఇస్తూ బీజేపీయేతర పాలిత రాష్ట్రమైన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడాన్ని సాయిరెడ్డి తప్పుబట్టారు. పుదుచ్చేరికి సైతం ఎన్నికల సమయంలో ప్రత్యేక రాష్ట్ర హోదా ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. దురదృష్టవశాత్తూ ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని అప్పటి సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారని సాయిరెడ్డి విమర్శించారు.
కేంద్రం ఇచ్చిన ప్యాకేజీని ఒప్పుకుని చంద్రబాబు పెద్ద తప్పుచేశారన్నారు. మరోవైపు టీడీపీ ప్రభుత్వంలో పరిమితికి మించి తీసుకున్న అప్పులపై ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంపై ఆంక్షలు విధిస్తున్న కేంద్రం.. గతంలో వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువగా తీసుకున్న అప్పులకు ఇప్పుడు తమను ఎందుకు కనికరించడం లేదని సాయిరెడ్డి ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications