జగన్ పిటిషన్ వెనుక అసలు కారణమిదే-షర్మిలపై వైఎస్ క్లారిటీ-వైవీ కామెంట్స్..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎన్సీఎల్టీలో కేసు వేయాల్సిన పరిస్ధితి ఎందుకొచ్చిందో వైసీపీ ఎంపీ, ఆయన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ వెల్లడించారు. సరస్వతి సిమెంట్స్ లో షేర్లు ఈడీ అటాచ్ మెంట్లో ఉండగా, హైకోర్టులో ఈ వ్యవహారం పెండింగ్ లో ఉండగా.. స్టేటస్ కో ఉండగా, న్యాయపరమైన చిక్కులు వస్తాయని తెలిసినా జగన్ కూ, ఇతర కుటుంబ సభ్యులకూ తెలియకుండా విజయమ్మ పేరు మీద షర్మిల షేర్లు బదిలీ చేశారని ఆరోపించారు.
జగన్ జైలుకు వెళ్లడానికి కారణం కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. టీడీపీ కుట్రలో భాగంగానే షర్మిల భాగమయ్యే పరిస్ధితి వచ్చిందన్నారు. ఆ పరిస్ధితి నుంచి జగన్ తనను తాను కాపాడుకోవడం కోసమే ఈ కేసు దాఖలు చేశారన్నారు. ఎల్లోమీడియా ప్రచారం చేస్తున్న విధంగా తల్లి,చెల్లిని కోర్టు కీడ్చాలన్న ఉద్దేశం ఇందులో లేదన్నారు.

వైఎస్ చనిపోయిన పదేళ్ల తర్వాత చెల్లెలికి ప్రేమతో, అభిమానంతో ఇవ్వాలనుకున్న ఆస్తుల కోసం ఒప్పందం చేసుకున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రేమ, అభిమానం లేకపోతే పదేళ్ల తర్వాత ఈ ఒప్పందం చేసుకోవాల్సిన అవసరమేముందన్నారు. జగన్ కష్టార్జితం ఈ ఆస్తులను ఆ ఒప్పందంలోనే ఉందన్నారు. అది చూశాకే షర్మిల సంతకం పెట్టారన్నారు. వైఎస్ బతికి ఉన్నప్పుడే కొన్ని ఆస్తులు జగన్, షర్మిలకు పంచారని వైవీ వెల్లడించారు.
షర్మిల గతంలో జగన్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆస్తులు కావాలనుకున్నప్పుడు న్యాయపరమైన సమస్యలు పట్టించుకోకుండా బదిలీ చేయడమే కాకుండా, మీడియాలో మాట్లాడటం వెనుక ఆమె ఉద్దేశం ఏంటని వైవీ ప్రశ్నించారు. వైఎస్ మరణం తర్వాత పదేళ్లలో ఆయా ఆస్తుల్ని అభివృద్ధి చేయడంలో షర్మిల పాత్ర లేదన్నారు. అయినా షర్మిలకు న్యాయంగా వాటా ఉందని భావిస్తే అప్పట్లో ఈడీ, సీబీఐ.. జగన్ పై మాత్రమే ఎందుకు కేసులు పెట్టాయని, ఆమెను ఎందుకు వదిలేశాయని వైవీ సూటిగా ప్రశ్నించారు.
కంపెనీల్లో షేర్ హోల్డర్లకు మాత్రమే డివిడెండ్లు ఇస్తారని, కానీ ఇక్కడ జగన్ డైరెక్టర్ గా ఉన్న కంపెనీల్లో ఆయనకు వచ్చిన డివిడెండ్లను షర్మిలకు ఇచ్చారని వైవీ తెలిపారు. నలుగురు పిల్లలకు ఆస్తుల్లో సమాన వాటా ఉందని షర్మిల చెప్పడంపై స్పందిస్తూ.. వైఎస్ బతికుండగా షర్మిలను కానీ, ఆమె భర్తను కానీ ఏ కంపెనీల్లోనూ డైరెక్టర్ గా పెట్టలేదన్నారు. వైఎస్ బతికున్నప్పుడే పెట్టిన కంపెనీల్లో షర్మిలను చేర్చాలని ఆయన చెప్పి ఉంటే జగన్ వాటా ఇచ్చేవారన్నారు. ఈ విషయంలో జగన్ కు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.












Click it and Unblock the Notifications