వైసీపీ మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల పూర్తి జాబితా ఇదే: బ్యాక్‌వర్డ్ కాదు..బ్యాక్‌బోన్: సజ్జల
అమరావతి: మున్సిపాలిటీల ఛైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్ల ఎంపికలో అన్ని వర్గాల ప్రజలకు సమాన ప్రాతినిథ్యాన్ని కల్పించామని అధికార వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. బడుగు, బలహీనవర్గాలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించామని చెప్పారు. సాధారణ కార్యకర్తలను అత్యున్నత పదవుల్లో కూర్చోబెట్టామని అన్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ఏడుమందికి మేయర్ పదవులను కేటాయించామని ఆయన పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే ఇదో సువర్ణాధ్యాయమని వ్యాఖ్యానించారు.

ఆ వర్గాలకు 78 శాతం పదవులు..
ఈ మధ్యాహ్నం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఛైర్మన్లు, మేయర్ల వివరాలతో కూడిన జాబితాను విడుదల చేశారు. 74 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లలో 78 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులను కల్పించామని, 52 మంది మహిళలను మేయర్లు, మున్సిపల్ చైర్మన్లుగా ఎంపిక చేశామని తెలిపారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ సాఫీగా సాగిందని, విశాఖపట్నం మేయర్ అభ్యర్థి సమస్యను పార్టీలో అంతర్గతంగా పరిష్కరించుకుంటామని సజ్జల అన్నారు.

ప్రలోభాలకు గురి చేయట్లేదు..
వైసీపీకి మెజారిటీ స్థానాలు దక్కని మైదుకూరు, తాడిపత్రిల్లో ప్రత్యర్థి పార్టీలకు చెందిన కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేయ లేదని అన్నారు. తాడిపత్రి మున్సిపల్ స్థానం విషయంలో ప్రజా తీర్పునకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. కుట్ర పూరిత రాజకీయాలకు తాము పాల్పడలేదని చెప్పారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏ వర్గానికి చెందిన జనాభా ఎక్కువ ఉంటే.. ఆ వర్గానికి చెందిన వారికి పదవులు ఇచ్చామని అన్నారు. చట్ట ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 45 పదవులు ఇవ్వాల్సి ఉండగా, అంతకుమించి 67 మందికి ఆయా వర్గాల నుంచి ప్రాతినిధ్యం కల్పించామని సజ్జల పేర్కొన్నారు.

బ్యాక్ బోన్ క్లాస్‌గా..
బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్లాసులు కాదు.. బ్యాక్‌బోన్ క్లాస్ అనే విషయాన్ని వైఎస్ జగన్ నమ్ముతున్నారని, అందుకే బీసీలకు మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవుల్లో చట్టం ఇచ్చిన పరిమితికి మించి చేశామని అన్నారు. బీసీలకు 46.51, మైనారిటీలకు 13.95, మహిళలకు 60.4 శాతం మేర పదవులు ఇచ్చామని, ఇలా దేశంలో ఇప్పటిదాకా ఏ రాష్ట్రంలోనూ సమతుల్యంతో కూడిన పదవుల కేటాయింపులు చోటు చేసుకోలేదని సజ్జల అన్నారు. నవరత్నాల్లోనూ మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయిదుమంది ఉప ముఖ్యమంత్రుల్లో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని పేర్కొన్నారు. రాజ్యసభకు నలుగురిని పంపితే అందులో ఇద్దరు బీసీలు ఉన్నారని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications