ఏపీలో మరో కూటమి వర్సెస్ వైసీపీ పోరు..! సచివాలయ కేంద్రంగా..!
ఏపీలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో అధికార వైసీపీని చిత్తుగా ఓడించి కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఏడాదిన్నర అవుతున్నా ఇప్పటివరకూ చెప్పుకోదగిన స్ధాయిలో ఎన్నికలేవీ జరగలేదు. వచ్చే ఏడాది స్దానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఆలోపే మరో రాష్ట్రస్థాయి ఎన్నికలకు రంగం రంగం సిద్దమవుతోంది. ఇది చూసేందుకు ఉద్యోగుల పోరు అయినా పార్టీల ఆధిపత్యం పరోక్షంగా తెరపైకి వస్తోంది.
అమరావతిలోని రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం పదవీకాలం ఈ నెల 29తో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. ప్రస్తుతం వైసీపీ మద్దతు ఉన్న కాకర్ల వెంకట్రామిరెడ్డి ప్యానెల్ అధికారంలో ఉంది. వెంకట్రామిరెడ్డిని కూటమి సర్కార్ రాగానే సస్పెండ్ చేశారు. అయినా కార్యవర్గం మాత్రం కొనసాగుతోంది. ఇప్పుడు మరోసారి ఎన్నికలు జరగనుండటంతో వీటిపై రాష్ట్రంలో ఆసక్తి నెలకొంది.

తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికల ప్రక్రియ ఈ నెల 11న ప్రారంభమవుతుంది. డిసెంబరు 11వ తేదీ జనరల్ బాడీ సమావేశం ఉంటుంది. 12వ తేదీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అనంతరం ఈ నెల 15, 16వ తేదీల్లో నామినేషన్లు స్వీకరిస్తారు. 17వ తేదీ నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. చివరిగా ఈ నెల 23వ తేదీ సచివాలయ ఉద్యోగుల సంఘం ఎన్నికలు జరుగుతాయి. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి విజేతల్ని ప్రకటిస్తారు.

ఈ లెక్కన చూస్తే సచివాలయ ఉద్యోగులే ఓటర్లుగా వారికి ప్రాతినిధ్యం వహించే సంఘాన్ని ఎన్నుకుంటారు. కానీ ఉద్యోగులపై పార్టీల ప్రభావం అంతర్గతంగా ఏ స్ధాయిలో ఉంటుందో గతంలో జరిగిన పలు ఎన్నికలు నిరూపించాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లోనూ ఉద్యోగులు పార్టీల వారీగా వీడిపోయి తమకు నచ్చిన వారిని ఎన్నుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే రాష్ట్ర సచివాలయం కావడంతో కూటమితో పాటు వైసీపీ కూడా ఉద్యోగుల్లో ఆధిపత్యం కోసం ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.












Click it and Unblock the Notifications