మరో'సారీ': నెరవేరని జగన్ లక్ష్యం, స్పీకర్‌పై అవిశ్వాసం.. వీగిపోయింది

హైదరాబాద్: శాసన సభాపతి కోడెల శివప్రసాద రావుపై వైసిపి పెట్టిన అవిశ్వాస తీర్మానం పైన మంగళవారం అసెంబ్లీలో చర్చ జరిగింది. అనంతరం ఓటింగ్ జరిగింది. స్పీకర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాసానికి వ్యతిరేకంగా 97 ఓట్లు వచ్చాయి. అవిశ్వాసానికి అనుకూలంగా 57 ఓట్లు వచ్చాయి. తటస్థం ఎవరూ లేరు.

నిన్న (సోమవారం) చంద్రబాబు ప్రభుత్వంపై పెట్టిన వైసిపి పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈ రోజు స్పీకర్ కోడెల పైన పెట్టిన అవిశ్వాసం కూడా వీగిపోయింది. తద్వారా వైసిపి అధినేత జగన్ ఏ లక్ష్యంతో అయితే ఈ రెండు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశ పెట్టారో ఆ లక్ష్యం మాత్రం నెరవేరలేదు.

2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి తరఫున గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. వీరి పైన అనర్హత వేటు వేయించాలనే లక్ష్యంతో జగన్ ఈ అవిశ్వాస తీర్మానాలు పెట్టారు.

ప్రభుత్వం పైన పెట్టిన అవిశ్వాస తీర్మానం సమయంలో.. సభ్యులు సభకు హాజరుకాలేదు. సభ్యులకు విప్ జారీ చేసే అవకాశం ఇవ్వకుండా వెంటనే చర్చ ప్రారంభించారు. అదే సమయంలో మూజువాణి ఓటుతో పూర్తి చేశారు.

ఈ రోజు స్పీకర్ పైన అవిశ్వాసం సమయంలో రూల్స్ మార్చారు. తద్వారా టిడిపిలో చేరిన సభ్యులపై చర్యలు అనే లక్ష్యంతో అవిశ్వాసం పెట్టిన జగన్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు.

YSRCP No Confidence Motion on Speaker, defeat

అంతకుముందు చర్చ..

అంతకుముందు చర్చ జరిగింది. ఈ సందర్భంగా బిజెపి సభ్యుడు విష్ణు కుమార్ రాజు మాట్లాడారు. స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం దురదృష్టకరమన్నారు. ప్రజాస్వామ్యానికి ఓ చక్రం ప్రతిపక్షం అయితే, మరో చక్రం విపక్షం అని, స్పీకర్ ఇరుసు అని వైసిపి.. స్పీకర్‌ను ఎన్నుకున్న సమయంలో చెప్పిందన్నారు.

జగన్ మాట అంటే మడమ తిప్పరని వైసిపి చెబతుంటుందని, మరి ఇప్పుడు స్పీకర్ పైన అవిశ్వాసం ఎందుకని ప్రశ్నించారు. నిన్న ప్రభుత్వం పైన, నేడు స్పీకర్ పైన రేపు మంత్రి యనమల రామకృష్ణుడు తదితరుల పైన కూడా నోటీసు ఇస్తారేమో అన్నారు.

దానికి మంత్రి యనమల మాట్లాడుతూ.. నాతో పాటు విష్ణు కుమార్ రాజు పైన కూడా ఇస్తే ఇద్దరం తోడుగా ఉంటామని సరదాగా అన్నారు.

దానికి విష్ణు కుమార్ రాజు మాట్లాడుతూ.. తాను చిన్నవాడిని అని, తనను బయటకు పంపించాలని అనుకుంటున్నారని సరదాగా వ్యాఖ్యానించారు. స్పీకర్ ఎన్నో మంచి పనులు చేశారన్నారు. అలాంటి స్పీకర్ పైన అవిశ్వాసం పెట్టడం తనకు బాధ వేస్తోందన్నారు.

జగన్ మాట్లాడుతూ.. స్పీకర్ పైన విశ్వాసంతో తాము నాడు కోడెల శివప్రసాద్ రావుకు మద్దతు పలికామని చెప్పారు. తాము ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని అధికార పార్టీ సభ్యులు వక్రీకరిస్తున్నారన్నారు. మా హక్కులను కాలరాస్తున్నారన్నారు.

తాము ఎంతో మర్యాదగా స్పీకర్‌ను ఎన్నుకున్నామని చెప్పారు. కానీ ఆయన సభను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలా నడిపిస్తున్నారన్నారు. రూల్స్ అధిగమించి రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేశారన్నారు. ఈ రోజు రూల్ నెంబర్ 71ను అధిగమించి అధికారం లేకున్నా సస్పెండ్ చేశారన్నారు.

తాము అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు టిడిపిలో చేరిన తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎందుకు ఓటు వేయరని ప్రశ్నించారు. ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ప్రజల్లోకి వెళ్లే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు క్రెడిబులిటీ, క్యారెక్టర్ ఉండాలన్నారు.

ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చి, మోసం చేసే గుణం చంద్రబాబుది అన్నారు. పీఠం కోసం సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన క్యారెక్టర్ అన్నారు. రాజ్యాంగాన్ని సైతం లెక్క చేయడం లేదనన్నారు. రాజ్యాంగాన్ని అతిక్రమించి రూలింగ్ ఇస్తున్నారన్నారు.

మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. జగన్‌కు క్రెడిబులిటీ, విశ్వసనీయత గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎంతో ఇచ్చిందని, వైయస్‌ను రెండుసార్లు ముఖ్యమంత్రిని చేసిందని చెప్పారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి, ఆ పార్టీకి పంగనామాలు పెట్టిన చరిత్ర జగన్‌ది అని ధ్వజమెత్తారు.

యనమల మాట్లాడుతూ.. తండ్రి శవం పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు పెట్టించుకున్న ఘనత జగన్‌ది అన్నారు. అనంతరం స్పీకర్ కోడెల పైన పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ తీసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+