ఏపీలో కులగణనతో వైసీపీ, టీడీపీల్లో ఎవరికి లాభం ? ఎవరికి నష్టం ?
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని విపక్ష ఇండియా కూటమి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఏపీలో కులాల సర్వే చేపట్టేందుకు ఆమోదం తెలుపుతూ నిన్న రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈనెల 21 నుంచి ఈ కులాల సర్వే జరగబోతోంది. రెండు నెలల్లో ఈ సర్వే పూర్తి చేసి ఫలితాలు కూడా ప్రకటించేందుకు అధికార వైసీపీ ప్రయత్నిస్తోంది. ఇందుకు అనుగుణంగా క్షేత్రస్ధాయిలో తమకున్న వాలంటీర్లు, ఇతర సిబ్బందిని మోహరించబోతోంది. అయితే రాజకీయంగా ఈ సర్వే మరి వైసీపీకి ఆశించిన ప్రయోజనం చేకూరుస్తుందా లేదా అన్న చర్చ జరుగుతోంది.
కులాల కుంపట్లతో అలరారే ఆంధ్రప్రదేశ్ లో వాటికున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అయితే కులాల గురించిన చర్చ తీవ్రంగా జరుగుతుంటుంది. ఏ కులానికి టికెట్లు ఇచ్చారు, ఏ కులానికి టికెట్ ఇస్తే ఓట్లు పడతాయి, నియోజకవర్గంలో ఏ కులం జనాభా ఎంత ఉంది, ఇలాంటి చర్చలు తీవ్రంగా జరుగుతుంటాయి. వీటి ఆధారంగానే రాజకీయ పార్టీలు టికెట్లు కూడా కేటాయిస్తుంటాయి. ఈ మధ్య మారిన ట్రెండ్ లో రిజర్వుడ్ సీట్లతో పాటు జనరల్ సీట్లలోనూ రిజర్వుడ్ కేటగిరీల అభ్యర్ధులకు టికెట్లు ఇస్తూ ఆయా వర్గాల ఓట్లు కొల్లగొట్టేందుకు వైసీపీ, టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇలాంటి సమయంలో ఏపీలో కులగణన చేపట్టడం ద్వారా రిజర్వేషన్ పొందుతున్న వర్గాల ఓట్లను గంపగుత్తగా కొల్ల గొట్టేందుకు అధికార వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులోనూ ముఖ్యంగా రాష్ట్రంలో దాదాపు 50 శాతం ఉన్నారని చెబుతున్న బీసీ ఓట్లను టార్గెట్ చేస్తూ వైసీపీ సర్కార్ ఈ కులాల సర్వే చేపడుతోంది. గతంలో విపక్ష టీడీపీకి దశాబ్దాలుగా అండగా ఉన్న బీసీలు తొలిసారి వైసీపీవైపు మొగ్గడంతో రాష్ట్రంలో భారీ విజయాన్ని అందుకున్న జగన్.. ఇప్పుడు దాన్ని సుస్ధిరం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ దిశగా అడుగులేస్తున్నారు.
ఇదంతా ఓ ఎత్తయితే రాష్ట్రంలో కులాల సర్వే చేపట్టి ఫలితాలు ప్రకటించడం ద్వారా ఆయా వర్గాలు ఎప్పటి నుంచో జనాభా ప్రాతిపదికన సీట్లు, రిజర్వేషన్లు కేటాయించాలంటూ ఎప్పటినుంచో చేస్తున్న డిమాండ్లకు ఊతం లభించడం ఖాయం. అలాగే కులాల సర్వేలో ఏ కులం జనాభా ఎంత ఉందో తేలిపోతుంది కాబట్టి దాని ప్రాతిపదికగా కేటాయింపులు పెంచాల్సిన పరిస్ధితి, హామీలు ఇవ్వాల్సిన పరిస్ధితి కూడా తలెత్తుతుంది. ఇవన్నీ చేసే పరిస్ధితి ఉంటే వైసీపీ కచ్చితంగా లబ్ది పొందుతుందని భావిస్తున్నారు. కానీ ఇప్పటికే దీంతో సంబంధం లేకుండానే బారీ సంఖ్యలో సీట్లు, పదవులు ఇస్తున్న వైసీపీకి ఇప్పుడు సర్వేతో కొత్తగా ఒనగూరే ప్రయోజనం ఏంటన్నది స్పష్టం కాలేదు.
మరోవైపు విపక్ష టీడీపీ గతంలో దశాబ్దాల పాటు బీసీల ఓట్లతో అధికారం అనుభవించింది. అలాగే బీసీలకు తమ పార్టీలో అత్యున్నత పదవులు కట్టబెట్టింది. అయితే గత ఎన్నికల సమయంలో ఇందులో కొన్ని కులాలు దూరం కావడంతో ఇబ్బందుల్లో పడ్డ టీడీపీ ఇప్పుడు కులాల సర్వేలో జనాభా ఎంతో తేలితే దాని ఆధారంగా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తాము అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు ఏం చేస్తుందనే హామీలు కూడా ఇవ్వాల్సిన పరిస్దితి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ విషయంలో వైసీపీతో పోటీ పడి కేటాయింపులు చేస్తే తప్ప టీడీపీకి ప్రయోజనం ఉండకపోవచ్చని అంచనా.












Click it and Unblock the Notifications