కత్తులు దూసుకునేవారు కలిసిపోయి (ఫొటోలు)
హైదరాబాద్: శాసనసభ శీతాకాలం సమావేశాల తొలి రోజు గురువారంనాడు ఆసక్తికరమైన దృశ్యాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు కెటి రామారావు, సమైక్యాంధ్ర యోధుడైన మంత్రి శైలజానాథ్ కరచాలనం చేసుకుని, నవ్వుతూ మాట్లాడుకోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు సమైక్యాంధ్ర ప్లకార్డులతో ప్రదర్శన చేశారు. శీతాకాలం సమావేశాలకు అసెంబ్లీ వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ, సీమాంధ్ర శాసనసభ్యులు ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నప్పటికీ వాతావరణం తేలికపరిచే దృశ్యాలు, సంఘటనలు కొన్ని చోటు చేసుకున్నాయి.
తెరాస శాసనసభ్యుడు టి. హరీష్ రావు సహచర శాసనసభ్యులతో శాసనసభలో అడుగుపెడుతూ జై తెలంగాణ నినాదాలు చేశారు. శాసనసభలో సమైక్య తీర్మానాన్ని ప్రతిపాదించడానికి కాంగ్రెసుకు చెందిన కొంత మంది శానససభ్యులు, వైయస్సార్ కాంగ్రెసు సభ్యులు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ, సమైక్యవాదాలతో మాటల ఈటెలతో కత్తులు దూసుకునేవారు కలిసిపోయి శాసనసభ ఆవరణలో కనిపించారు. శుక్రవారంనుంచి శాసనసభా సమావేశాలు వేడెక్కనున్నాయి. వాదనల్లో వారు ప్రత్యర్థులుగా మారిపోయి విమర్శనాస్త్రాలు సంధించుకోనున్నారు.

భూమన సమైక్య నినాదం..
సమైక్యాంధ్ర కోసం తాము పోరాటం చేస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.

సమైక్య, తెలంగాణ పోటాపోటీ
అతివాద సమైక్యవాది భూమన కరుణాకర్ రెడ్డి, అతివాద తెలంగాణవాది హరీశ్వర్ రెడ్డి ఇలా ముచ్చట్లలో మునిగిపోయారు.

సొంతవారిపై కోమటిరెడ్డి ఆరోపణ
కాంగ్రెసు కోవర్టులు ఉన్నారని తెలంగాణకు చెందిన కాంగ్రెసు శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యాఖ్యానించారు.

హరీష్ రావు స్లోగన్
తోటి శాసనసభ్యులతో కలిసి శాసనసభలోకి వెళ్తూ తెరాస శాసనసభ్యుడు టి. హరీష్ రావు జై తెలంగాణ నినాదం చేస్తూ ఇలా..

బిజెపి ఎమ్మెల్యే ఇలా..
తెలంగాణకు తాము అనుకూలమని, పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికి తమ పార్టీ మద్దతు ఇవ్వదని బిజెపి శాసనసభ్యుడు లక్ష్మినారాయణ చెప్పారు.

సమైక్య ప్లకార్డులు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు శాసనసభ ఆవరణలో సేవ్ ఆంధ్రప్రదేశ్, సమైక్యాంధ్ర ప్లకార్డులను ప్రదర్శించారు.

శ్రీకాంత్ రెడ్డితో కిచ్చెన్నగారి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డితో ఏదో మాట్లాడుతూ కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి.. తెలంగాణ బిల్లు వచ్చినా రాకపోయినా తాము సమైక్యాంధ్ర తీర్మానాన్ని సభలో ప్రవేశపెడుతామని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.

జెసి దూకుడు..
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణపై తీవ్ర వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించిన కాంగ్రెసు రాయలసీమ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సమైక్య తీర్మాన ప్రతిపాదనకు తెర తీశారు.

బిల్లు వస్తే ఏం చెబుతారు..
మజ్లీస్ శాసనసభ్యులు అసెంబ్లీ ఆవరణలో ఇలా కనిపించారు. సమైక్యాంధ్ర తీర్మానానికి వారు మద్దతు ఇస్తారా...

కెటిఆర్, శైలజానాథ్ షేక్ హ్యాండ్
తెలంగాణ కోసం పోరాడుతున్న తెరాస శాసనసభ్యుడు కెటి రామరావు, సమైక్యవాది అయిన మంత్రి శైలజానాథ్ ఇలా పరస్పరం కరచాలనం చేసుకున్నారు.

నవ్వుతూనే మాట్లాడుకున్నారు..
సమైక్యవాది శైలజానాథ్, తెలంగాణవాది కెటి రామారావు నవ్వుతూనే పలకరించుకున్నారు. ఎవరి వ్యూహాల్లో వారు ఉంటూనే ఇలా నవ్వుతూ మాట్లాడుకున్నారు.