అమరావతిపై చంద్రబాబు కామెంట్స్ రచ్చ- విజయవాడలో వైసీపీ భారీ నిరసన ర్యాలీ..
ఏపీలో పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీపై వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు ముదురుతోంది. అమరావతిలో పేదలకు సెంటు స్ధలం ఇవ్వాలన్న వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని తప్పుబడుతూ సమాధి కట్టుకోవడానికి తప్ప ఎందుకూ పనికిరాదంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ మండిపడుతోంది. ఈ క్రమంలో ఇవాళ చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని వైసీపీ పిలుపునిచ్చింది.
టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యల్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా విజయవాడలో భారీ ర్యాలీ జరిగింది. మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఆదేశాలతో స్ధానిక వైసీపీ నేతలు భవానీపురంలోని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మితో పాటు పలు కార్పోరేషన్ల ఛైర్మన్లు, ఇతర వైసీపీ నాయకులు ఇందులో పాల్గొన్నారు.

పేదలకు అమరావతిలో ఇచ్చిన భూములను స్మశానాలతో పోలచడం చంద్రబాబుకి సబబు కాదని మేయర్ భాగ్యలక్ష్మి తెలిపారు. రాబోయే కాలంలో చంద్రబాబుకి రాష్ట్ర ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెపుతారన్నారు. చంద్రబాబును రాష్ట్రంనుండి తరిమికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. జగనన్న మా సొంత ఇంటి కల నెరవేర్చారని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. అచ్చంనాయుడు మాటలు హేయం అన్నారు. టీడీపీ నేతలకు వైసీపీ బుద్ధి చెప్తుందన్నారు.
చంద్రబాబు కామెంట్స్ వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో ర్యాలీలు, నిరసనలు చేపడుతున్నారు. అయితే సెంటుభూమి సరిపోదనే అంశాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే విజయవాడలో ఎన్టీఆర్ వారసత్వం విషయంలో వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర మాటలయుద్ధం, ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications