చంద్రబాబు రిలీజ్ పై వైసీపీ రియాక్షన్ ఇదే-టీడీపీ సంబరాలపై సజ్జల, కొడాలి ఫైర్..
ఏపీలో విపక్ష నేత చంద్రబాబుకు స్కిల్ కేసులో హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో టీడీపీ చేస్తున్న హంగామాపై అధికార వైసీపీ స్పందించింది. కండీషనల్ బెయిల్ పై బయటికి వస్తే కూడా సంబరాలు చేస్తారా అని వైసీపీ నేతలు ప్రశ్నించారు. నిజం గెలిచిందంటూ టీడీపీ నేతలు ఎలా సంబరాలు చేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కంటి ఆపరేషన్ కోసం బెయిల్ పై బయటికొస్తే.. టీడీపీ గొప్పగా చెప్పుకుంటోందని విమర్శించారు.
కంటి క్యాటరాక్ట్ ఆపరేషన్ కోసమే చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది తప్ప ఈ కేసు కొట్టేయలేదు గదా అని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరి ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కేడర్ విజయోత్సవ సంబరాలు జరుపుకోవడంలో అర్ధమేంటని ప్రశ్నించారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వలేదని, అది ఇంకా విచారణలో ఉందన్నారు. కేసు మెరిట్స్‌పై విచారణ న్యాయస్థానంలో జరగలేదని, పోనీ ఆయనేమన్నా నిర్దోషిగా బయటకొస్తున్నారా..? అంటే, అదీ కాదన్నారు.

చంద్రబాబు బెయిల్, విడుదలపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని కూడా స్పందించారు. చంద్రబాబుకు కోర్టు ఇచ్చింది కేవలం 4 వారాల పాటు పలు షరతులతో కూడిన బెయిలేనని కొడాలి తెలిపారు. అది కూడా ఆరోగ్య కారణాలను సాకుగా చూపడం వల్ల వచ్చిందన్నారు. ఈ మాత్రం దానికే టీడీపీ నేతల సంబరాలు ఎందుకో అని ప్రశ్నించారు. చంద్రబాబు నిర్దోషిగా బయటికి రావాల్సింది కానీ ముద్దాయి గా బయటికి వస్తున్నారని ఎద్దేవా చేశారు.
మరోవైపు చంద్రబాబుకు మధ్యంతర బెయిలు వచ్చింది కాబట్టి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటారా అని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. నిజం గెలిచిందో లేదో ఆమె చెప్పాలి, అమె చేస్తున్న కార్యక్రమంపై అంతా ముక్కున వేలేసుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును జైల్లో పెడితే రోడ్డుపై పడుకుని పవన్ కల్యాణ్ నానా విన్యాసాలు చేశారని గుర్తుచేశారు. చివరి వరకూ వీరి పొత్తు నిలబడుతుందా లేదా అన్నది చూడాలని కొట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications