Raghurama మరో లేఖ: జరగాలి మా చెల్లి పెళ్లి మళ్లీ మళ్లీ..శోభనానికి కూడా పనికిరావట..మనోళ్లు చెప్పారు
అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాజాగా మరో లేఖ రాశారు. నవ సూచనలు (వినమ్రతతో) అనే సిరీస్‌ను ప్రారంభించారు. ఈ సిరీస్‌లో తొలి లేఖను కొద్దిసేపటి కిందటే రాశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న జగనన్న హౌసింగ్ కాలనీల అంశాన్ని ప్రస్తావించారు. ఈ పథకంపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కాలనీలకు దశలవారీగా శంకుస్థాపనలు చేయడం సరికాదని అన్నారు. ఈ శంకుస్థాపనల వ్యవహారం మా చెల్లి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ.. అనే డైలాగ్‌ను గుర్తుకు తెస్తోందని అన్నారు.

అమృత్ స్కీమ్ గృహాలేమయ్యాయ్..
అమృత్ పథకం కింద గత ప్రభుత్వాలు నిర్మించిన గృహాలను ఇంకా లబ్దిదారులకు ఎందుకు అందజేయట్లేదని రఘురామ ప్రశ్నించారు. అమృత్ పథకం కింద ఏ ప్రభుత్వం నిర్మించినా కూడా అవి ప్రజల సొమ్ముతోనే నిర్మితమయ్యాయని, వాటికి సొంత పేర్లు పెట్టుకోవడం సరికాదని అన్నారు. 24 నెలలుగా వాటిని లబ్దిదారులకు అందించకపోవడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. 50 వేల కోట్ల రూపాయల వ్యయంతో గత ప్రభుత్వం 25.57 లక్షల గృహ నిర్మాణాలకు పూనుకుందని, ఇందులో ఆరు లక్షల యూనిట్లను పట్టణాలు, మిగిలిన వాటిని గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టిందని గుర్తు చేశారు. వాటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం తనవంతు సహకారాన్ని అందించిందని చెప్పారు.

నాసిరకం నిర్మాణాలు..
జగనన్న కాలనీ పథకం కింద నిర్మిస్తోన్న గృహాలు నాసిరకంగా ఉంటోన్నాయనే విషయం మీడియా ద్వారా తెలిసిందని రఘురామ చెప్పారు. తక్కువ ఖర్చుతో శరవేగంగా వాటిని నిర్మించాలంటూ అధికారులను ఆదేశించడం ద్వారా ఈ పరిస్థితి తలెత్తి ఉంటుందని తాను భావిస్తున్నానని అన్నారు. జీఐ మెష్, థర్మోకోల్ వంటివి వినియోగించడం వల్ల గృహాలు సుదీర్ఘకాలం పాటు ఉండలేవని అభిప్రాయపడ్డారు. 975 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నందున.. తరచూ తుఫాన్లు సంభవిస్తుంటాయని, నాసిరకంగా నిర్మితమౌతోన్న ఈ గృహాలు వాటికి తట్టుకోగలుగుతాయా? అనే సందేహాలు వ్యక్తమౌతోన్నాయని చెప్పారు.

శోభనానికి కూడా
ఈ ఇళ్లల్లోని బెడ్‌రూమ్ శోభనానికి కూడా చాలదంటూ సొంత పార్టీకే చెందిన శాసన సభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని రఘురామ తన లేఖలో పేర్కొన్నారు. ఇది ప్రజల మాటగా తాను భావిస్తున్నట్లు చెప్పారు. కొనని సంవత్సరాల పాటు నిలిచి ఉండేలా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని సూచించారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులను కల్పించడానికి, ఇళ్ల నిర్మాణానికి ప్రజల నుంచి కూడా కొంత నిధులను సమీకరించాలని, దీనికి లబ్దిదారులు కూడా సహకరిస్తారని చెప్పారు.

డిజైన్ మార్చండి..
ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని- ఇళ్ల నిర్మాణ డిజైన్లను మార్చే అవకాశాన్ని పరిశీలించాలని రఘురామ సూచించారు. నాణ్యమైన భవన సామాగ్రి, నిర్మాణ ప్రమాణాలను పాటించాలని అన్నారు. లబ్దిదారుల నుంచి కూడా కొంత నిధులను సమీకరించే దిశగా ఆలోచన చేయాలని అన్నారు. సుదీర్ఘకాలం పాటు జగనన్న కాలనీలు నిలిచి ఉండేలా వాటిని తీర్చిదిద్దాలని అన్నారు. ఇదివరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో లబ్దిదారులకు కేటాయించిన గృహాల్లో ఇప్పటికీ లబ్దిదారులు ఆక్యుపై చేసుకోలేదని, ఇదే తరహా పరిస్థితిని మళ్లీ తీసుకుని రావొద్దని అన్నారు.












Click it and Unblock the Notifications