కంటెంట్ ఉన్న కటౌట్ - నిలబెట్టిందెవరు..?!
భీమవరం: రాష్ట్రంలో సంక్రాంతి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. పల్లెటూళ్లన్నీ కళకళలాడుతున్నాయి. పొరుగు రాష్ట్రాల్లో స్థిరపడిన వారందరూ సొంతర్లకు చేరుకున్నారు. దీనికి అనుగుణంగా కోడి పందాలు ముమ్మరం అయ్యాయి. వందల కోట్ల రూపాయల మేర లావాదేవీలు రికార్డవుతున్నాయి. సంక్రాంతి నాడు కోడిపందాలను నిర్వహించడం కోనసీమ జిల్లాల్లో ఆనవాయితీగా వస్తోంది. ఇది చట్టవ్యతిరేకం కావడం వల్ల దీన్ని నిర్వహించడానికి పోలీసులు అనుమతులు ఇవ్వలేదు. అయినప్పటికీ నిర్వాహకులు తగ్గలేదు.

వందల సంఖ్యలో..
పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పెద్ద ఎత్తున కోడిపందాలను నిర్వహిస్తుంటారు ప్రతి సంవత్సరం కూడా. అమలాపురం, భీమవరం, రాజోలు వంటి చోట్ల కోట్ల రూపాయల మేర చేతులు మారుతుంటాయి. భోగి, సంక్రాంతి, కనుమ.. ఈ మూడు రోజుల్లో వందల సంఖ్యలో కోడిపందాలు జరుగుతుంటాయి. అదే స్థాయిలో కోట్ల రూపాయల మేర లావాదేవీలు నమోదవుతుంటాయి.

అనుమతి లేకున్నా..
ఈ ఏడాది కూడా కోడి పందాల నిర్వహించడానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రచారం కూడా చేస్తోన్నారు. కోడిపందాల నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోన్నారు. అయినప్పటికీ- కోడి పందాల నిర్వాహక్కుల ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తమ కార్యకలాపాలను తాము కొనసాగిస్తోన్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాకినాడలో కోడి పందాలను వీక్షించారు.

భారీ కటౌట్..
కాగా- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నర్సాపురం తిరుగుబాటు లోక్ సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు భారీ కటౌట్.. ఆకట్టుకుంటోంది. భీమవరంలో ఏర్పాటు చేసిన కోడి పందాల బరుల వద్ద ఈ కటౌట్ ను ఏర్పాటు చేశారు ఆయన అభిమానులు. చేతిలో కోడి పుంజును పట్టుకున్న గెటప్ లో కనిపిస్తోన్నారు రఘురామ కృష్ణంరాజు. సుమారు 70 అడుగుల ఎత్తు ఉన్న కటౌట్ గా చెబుతున్నారు ఆయన అభిమానులు.

నియోజకవర్గానికి రాకపోయినా..
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో రఘురామ కృష్ణంరాజు.. నర్సాపురం లోక్ సభ స్థానం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామ రాజు మీద 31 వేల ఓట్లకు పైగా తేడాతో గెలుపొందారు. ఆ తరువాత ఆయన పార్టీకి దూరం అయ్యారు. సొంత పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తూ వస్తోన్నారు.

వైఎస్ జగన్ పైనా..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి, పార్లమెంటరీ పార్టీ చీఫ్ విజయసాయిరెడ్డిని టార్గెట్ గా చేసుకుని తరచూ ఘాటు వ్యాఖ్యలు చేస్తోన్నారు. ఆయనపై అనర్హత వేటు వేయడానికి అటు వైఎస్ఆర్సీపీ కూడా తనవంతు ప్రయత్నాలు తాను చేస్తోంది. సుదీర్ఘకాలంగా ఆయన తన నియోజకవర్గానికీ దూరంగా ఉంటోన్నారు. ఢిల్లీకే పరిమితం అయ్యారు. నియోజకవర్గం పరిధిలో పలు కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన ఇక్కడికి రావట్లేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications