వైసీపీ ముందస్తుకు అందుకే బ్రేక్ ? పవన్-చంద్రబాబు భేటీతో ! పవన్ కు కాపు రౌండప్ -RRR కామెంట్స్
ఏపీ రాజకీయాలపై, ముఖ్యంగా సొంత పార్టీ వైసీపీపై నిత్యం తనదైన శైలిలో సెటైర్లు వేసే రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్-చంద్రబాబు తాజా భేటీ, వైసీపీ ముందస్తు ఎన్నికల వ్యూహాలు, పవన్ కళ్యాణ్ ను కాపులకు పరిమితం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై రఘురామ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

రఘురామ కామెంట్స్
ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈసారి పవన్-చంద్రబాబు భేటీ, దానిపై వస్తున్న రెస్పాన్స్, వైసీపీ నేతల స్పందనతో పాటు మరికొన్ని అంశాలపై రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే ఏపీలో వైసీపీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతుందంటూ జరుగుతున్న ప్రచారంపైనా రఘురామ స్పందించారు. దీంతో పాటు పవన్ కళ్యాణ్ తాజా రాజకీయం, ఆయన్ను కట్టడి చేసేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలపైనా తనదైన శైలిలో రఘురామ వ్యాఖ్యలు చేశారు.

కోర్టుకెళ్తే జీవో 1కు చెక్
ఏపీలో కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనల నేపథ్యంలో వైసీపీ సర్కార్ తెరపైకి తెచ్చిన జీవో నంబర్ 1 పై రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ జీవో రాజ్యాంగ విరుద్ధమన్నారు. దీనిపై ఎవరైనా కోర్టుకు వెళితే కొట్టేస్తారని రఘురామ తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు వంటి నాయకుడిని అడ్డుకుంటారా అని రఘురామ ప్రశ్నించారు. ఏపీలో పోలీసు ప్రభుత్వం పతనం అంచుల్లో ఉందని వైసీపీ రెబెల్ ఎంపీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే జీవో నంబర్ 1తో విపక్షాల్ని కట్టడి చేసేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తున్న తరుణంలో రఘరామ వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి.

చంద్రబాబు-పవన్ భేటీతో..
హైదరాబాద్ లో నిన్న చంద్రబాబు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లిన ఘటనపై నిన్న ఓసారి స్పందించిన రఘురామ.. ఇవాళ కూడా దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, పవన్ భేటీతో మావాళ్ల ప్యాంట్లు తడిసిపోయాయి అంటూ వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. వైసీపీకి భయం లేకుంటే సాక్షిలో అంతపెద్ద వార్తలు ఎందుకని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే టీడీపీ-జనసేన పొత్తు ఉండే అవకాశం ఉందని రఘురామ వెల్లడించారు. తద్వారా వీరి పొత్తు మాత్రం ఖాయమన్నారు.

సర్వే రిపోర్ట్ తో ముందస్తుకు బ్రేక్ ?
ఏపీలో ముందస్తు ఎన్నికలపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సీఎం జగన్ ఢిల్లీ టూర్, అనంతర పరిణామాలతో ముందస్తుపై చర్చ పెరిగింది. ఈ నేపథ్యంలో ఇవాళ రఘురామ కూడా ముందస్తు ఎన్నికలపై స్పందించారు. ముఖ్యంగా వైసీపీ ముందస్తు వ్యూహాలకు తాజా సర్వేతో బ్రేక్ పడినట్లుందన్నారు. ఎన్నికలపై సర్వే రిపోర్ట్ వచ్చినట్లుంది, అందుకే మా పార్టీ ముందస్తుకు వెళ్లడం లేదన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన వైసీపీ కీలక నేత సజ్దల కూడా ముందస్తు ఆలోచనలు లేవని మరోసారి నిర్ధారించారు.

పవన్ ను కాపులకు పరిమితం చేసే ప్లాన్ ?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనా రఘురామకృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఒక్క సినిమా తీస్తే రూ.100 కోట్లు వస్తాయని, ఆయనకు అడుక్కునే కర్మ ఏంటని రఘురామరాజు ప్రశ్నించారు. టీడీపీతో పొత్తుకు పవన్ పాకులాడుతున్నారని వైసీపీ నేతల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో రఘురామ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే పవన్‍ను కాపు సామాజిక వర్గానికే పరిమితం చేయాలని చూస్తున్నారని వైసీపీని ఉద్దేశించి రఘురామ పేర్కొన్నారు. కాపుల్లో వైసీపీకి బలం లేదని, బీసీ, ఎస్సీల్లో కూడా ఇబ్బందులు తప్పవన్నారు.












Click it and Unblock the Notifications