చివరిగా ఓటు వేసిన ఆ ఎమ్మెల్యే- ఇంకాస్సేపట్లో..!!
అమరావతి: ఏపీలో శాసన మండలి ఎన్నికల ప్రక్రియ ఇవ్వాళ్టితో ముగియనుంది. ఇప్పటివరకు స్థానిక సంస్థలు, ఉపాధ్యాయులు, పట్టభద్ర నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిశాయి. ఇందులో స్థానిక సంస్థలు, ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. మొత్తం స్థానాలన్నింటినీ క్లీన్ స్వీప్ చేసింది. తొమ్మిది స్థానిక సంస్థలు, రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలను సొంతం చేసుకుంది.
పట్టభద్ర నియోజకవర్గాల్లో మాత్రం వైసీపీకి ఎదురుగాలి వీచింది. తెలుగుదేశం పార్టీ ఇక్కడ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిచింది. మొత్తం మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా- టీడీపీ వాటన్నింటినీ కైవసం చేసుకుంది. ఉత్తరాంధ్ర, పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు.

ఇక తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ కొద్దిసేపటి కిందటే ముగిసింది. అధికార వైఎస్ఆర్సీపీ, ప్రతిపక్ష తెలుగుదేశానికి చెందిన మొత్తం 175 మంది శాసన సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సహా ఆయా పార్టీలకు చెందిన సభ్యులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అందరికంటే చివరగా నెల్లిమర్లకు చెందిన వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు బడ్డుకొండ అప్పల్నాయుడు ఓటు వేశారు. తన కుమారుడి వివాహ కార్యక్రమాల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల ఆయన అసెంబ్లీకి రావడంలో ఆలస్యమైంది. వివాహ కార్యక్రమాలన్నింటినీ ముగించుకున్న వెంటనే ఆయన స్పెషల్ ఫ్లైట్ లో విజయవాడకు చేరుకున్నారు. సమయం మించి పోతోండటం వల్ల వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఆయనకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది.

విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో దిగిన వెంటనే ఆయన కారులో అసెంబ్లీకి చేరుకున్నారు. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మండపేట శాసన సభ్యుడు వేగుళ్ల జోగేశ్వర రావు వీల్ చైర్ లో అసెంబ్లీకి వచ్చారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్నారు. ఫలితంగా వీల్ చైర్ లో అసెంబ్లీకి వచ్చి.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.












Click it and Unblock the Notifications