వైసీపీకి భారీ షాక్.. ఏప్రిల్ 4న టీడీపీలోకి కీలకనేత
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సార్వత్రిక ఎన్నికల సమరం హోరాహోరీగా జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్నవేళ అధికార పార్టీ నుంచి ప్రతిపక్షాల్లోకి ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. ఇదేకోవలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణ మూర్తి కూడా పార్టీని వీడనున్నాయి. ఆయన పార్టీని వీడతారంటూ ఎప్పటినుంచో వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటికీ ఒక స్పష్టత ఇచ్చారు. బాపట్ల పర్యటనలో చంద్రబాబునాయుడిని కలిసిన తర్వాత చేరికపై ఒక నిర్ణయం తీసుకోవాలనే యోచనలో జంగా ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేసిన జంగా ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి గురజాలలో పోటీచేయడానికి సీటును ఆశించారు. కానీ వైఎస్ జగన్ నిరాకరించడంతో ఆయన పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు. వరుసగా రెండు ఎన్నికల్లో పోటీచేయకుండా ఉంటే రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకమవుతుందని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఎటువంటి అవకాశం లేకపోయినప్పటికీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పదవిని ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఆ హామీ ప్రకారం ఏప్రిల్ నాలుగు లేదంటే ఐదో తేదీన పల్నాడు జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో చంద్రబాబు సమక్షంలో తన అనుచరులతో పార్టీ మారనున్నారు. గురజాల నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున యరపతినేని శ్రీనివాసరావు పోటీచేస్తున్నారు. గతంలో యరపతినేనిపైనే జంగా విజయం సాధించారు. రానున్న ఎన్నికల్లో యరపతినేని గెలుపునకు సహకరిస్తానని జంగా పార్టీ అధినేతకు హామీ ఇచ్చారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో రాజకీయ నేతల జంపింగ్ విన్యాసాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో? ఎవరు ఏ పార్టీలో చేరుతున్నారో ఎవరికీ అర్థం కాకుండా ఉంది.












Click it and Unblock the Notifications