వైసీపీ ఆవిర్భావం రోజే.. బిగ్ డెసిషన్
YSRCP Yuvata Poru: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. యువత పోరు సన్నద్ధమౌతోంద. ఈ నెల 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను నిర్వహించనుంది. దీనికి సంబంధించిన పోస్టర్లు కూడా విడుదల అయ్యాయి. ఈ ఆందోళన సందర్భంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించాలని నిర్ణయించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..ఫీజు రీఎంబర్స్‌మెంట్ చెల్లించకపోవడాన్ని నిరసనగా యువత పోరు ఉద్యమానికి శ్రీకారం చుట్టింది వైఎస్ఆర్సీపీ.

యువత పోరు పోస్టర్‌ను తాజాగా తిరుపతిలో పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువతకు భరోసాగా చంద్రబాబు- పవన్ కల్యాణ్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమంలో భాగంగా యువత పోరును నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ తొమ్మిది నెలల్లో ఒక్క రూపాయి కూడా ఫీజు రీఎంబర్స్‌మెంట్ విడుదల కావట్లేదంటూ వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నిరుద్యోగ భృతి విషయంలో కూటమి ప్రభుత్వం మాట తప్పిందంటూ మండిపడుతున్నారు. కూటమి స్వార్థ ప్రయోజనాల కోసం మెడికల్ కాలేజీలను సైతం ప్రైవేటీకరించే ప్రయత్నిస్తోందంటూ ఆరోపిస్తోన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి మూడు ప్రధాన హామీలు అమలు చేయని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఫీజు రీఎంబర్స్‌మెంట్ నిధులు సకాలంలో విడుదల చేయని కారణంగా విద్యార్థులు చదువులకు దూరమైపోతున్నారని విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా యువతను మోసగిస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వ హయాంలో ముందుచూపుతో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు మొదలుపెట్టి, వాటిలో అయిదు కాలేజీల్లో అడ్మిషన్లు కూడా ప్రారంభించామని గుర్తు చేశారు.
మిగిలిన మెడికల్ కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్లు కల్పించకుండా పీపీపీ విధానంలో ప్రైవేటుపరం చేయాలని చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం నిర్ణయించిందని, వైద్య విద్య చదవాలన్న పేద విద్యార్థుల ఆశలపై నీళ్లు చల్లుతున్నారని ఆరోపించారు. ఈ మూడు అంశాలపై యువత, విద్యార్థులు, నిరుద్యోగులకు అండగా నిలవడానికి, ఈనెల 12న యువత పోరు తలపెట్టామని చెప్పారు.
మార్చి 12వ తేదీన వైఎస్ఆర్‌సీపీ ఆవిర్భావ దినోత్సవమని, అందుకే అదే రోజున పార్టీ శ్రేణులంతా ర్యాలీగా యువత పోరు కార్యక్రమంలో పాల్గొంటారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలను నిర్వహిస్తామని, తమ నిరసనను తెలియజేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications