AP Results: ఒకే రోజు స్పందించిన వైసీపీ,టీడీపీ,బీజేపీ-ఎవరి ధీమా వారిదే..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సమయం దగ్గరపడుతోంది. మరో వారం రోజుల్లో అంటే జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించేందుకు ఈసీ సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలతో పాటు సాధారణ ఓటర్లలోనూ ఉత్కంఠ పెరుగుతోంది. అదే సమయంలో రాజకీయ పార్టీలు ప్రత్యర్ధులపై గతానికి భిన్నంగా పోలింగ్ తర్వాత కూడా పోరు కొనసాగిస్తున్నాయి. ఇవాళ మూడు పార్టీలు ప్రత్యర్దులపై విమర్శలతో మొదలుపెట్టి తమ అంచనాలను వెల్లడించాయి.
ఏపీలో ఎన్నికల ఫలితాలపై స్పందించిన బీజేపీ నేత పాతూరి నాగభూషణం.. వైసీపీ ఓడిపోతున్నాం, ఆల్రెడీ ఓడిపోయాం అని తెలిసి కూడా ఇంకా హడావిడి చేస్తోందన్నారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రాజకీయమంతా ఓ వ్యక్తి (సీఎస్) చుట్టూ తిరుగుతోందని ఆయన ఆరోపించారు. దీనిపై ఆయన సమాధానం చెప్పాలన్నారు. ఆయన ఏ పార్టీ వ్యక్తికి కొమ్ము కాస్తున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో సమస్యలపై సీఎస్ ఎందుకు సమీక్షలు చేయడం లేదన్నారు.

మరోవైపు వారం రోజుల్లో రాష్ట్రానికి టీడీపీ పీడ విరగడవుతుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ తెలిపారు. ఫలితాలకు ముందు తాత్కాలిక ఆనందాలకు వెళ్లాలనుకోవడం లేదన్నారు. బెట్టింగ్ లకో, సోషల్ మీడియాలో ప్రచారం కోసం తాము ప్రయత్నించడం లేదన్నారు. ఉత్తరాదిలో ఓట్ల కోసం ఏపీలో కూటమి గెలుస్తుందని అమిత్ షా చెప్పి ఉండొచ్చంటూ అమిత్ షా వ్యాఖ్యలకు సజ్జల అర్దం చెప్పారు.
అటు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ.. సజ్జల వ్యాఖ్యలపై స్పందించారు. వారం రోజుల్లో రాష్ట్రానికి పట్టిన గ్రహణం వదలబోతోందని ఉమ జోస్యం చెప్పారు. వైసీపీ నేతలు ఎగ్జిట్ పోల్స్ సమాచారం తెప్పించుకున్నారని, లండన్ కు ఆ సమాచారం వెళ్లి అక్కడ జగన్ టీవీలు పగలగొడుతున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ఈసారి ప్రజలు బ్రహ్మాండమైన మెజార్టీతో కూటమిని అధికారంలోకి తెస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన వాళ్లు ఎక్కడ దాక్కున్నా బయటికి తెస్తామన్నారు.












Click it and Unblock the Notifications