వైసీపీ కీలక నిర్ణయం-పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లులు..అవిశ్వాసం వేళ ఝలక్..!
పార్లమెంటులో జరగబోయే అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీకి జరిగిన అన్యాయంపై గళమెత్తాలని వైసీపీ నిర్ణయించింది. దేశం అంతా మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించే విధంగా మాట్లాడతామని ఎంపీ మార్గాని భరత్ ఇవాళ తెలిపారు. పది మంది ఎంపీలతో ఏపీ రీఆర్గనైజేషన్ అమెండ్‌మెంట్ బిల్-2023ను ప్రైవేటు మెంబర్ బిల్లుగా ప్రవేశ పెట్టబోతున్నట్లు భరత్ ప్రకటించారు. ఇవాళ వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి మరో ప్రైవేట్ బిల్లు పెడుతున్నారు.
విభజన హామీల అమలుకు సంబంధించిన ప్రైవేటు మెంబర్ బిల్లును గతంలో పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారని, అయితే ఆ బిల్లు ఫైనాన్స్ తో ముడిపడిన అంశం కావడం వల్ల లోక్ సభలోనే ప్రవేశపెట్టాలని సూచించారని భరత్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ బిల్లును లోక్ సభలో ప్రవేశపెడుతున్నట్లు భరత్ పేర్కొన్నారు. కేంద్రంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుందన్నారు.

విభజన హామీలపై గత ప్రభుత్వంలో చంద్రబాబు యూ టర్న్ తీసుకుని ఏపీని వెనక్కు తోశారని మార్గాని భరత్ ఆరోపించారు. ఆ తప్పిదాలను సవరించుకుంటూ ఏపీకి రావాల్సినవన్నిటినీ రాబడుతున్నామన్నారు. ఈ ప్రైవేటు మెంబర్ బిల్లులో ప్రత్యేక హోదా డిమాండ్‌ను ప్రధానంగా ముందు పెడుతున్నామన్నారు. పోలవరం నిధులకు సంబంధించి ప్రాజెక్టు ఆథారిటీ సవరించిన అంచనాలపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆ అంచనాలను ఆమోదించాలనే డిమాండ్ ఈ బిల్లులో ఉండబోతోందన్నారు.
విభజన చట్టం ప్రకారం గతంలో రాష్ట్రంలోని 7 వెనుకబడిన జిల్లాలకు జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున నిధులిచ్చారని, ప్రస్తుతం తలసరి ఆదాయం ప్రకారం ఆయా జిల్లాలకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేయబోతున్నట్లు భరత్ తెలిపారు. దీనివల్ల ఒక్కో జిల్లాకు రూ.1000 కోట్లు రావడానికి అవకాశం ఉందన్నారు. వాల్తేరు డివిజన్‌ను కలుపుకుని సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌ను ఇవ్వాలని కూడా డిమాండ్ చేయనున్నామన్నారు. ఈ బిల్లు త్వరలో టేబుల్ అవుతుందన్నారు. వచ్చే సమావేశాల్లో ఈ బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉందన్నారు.
మరో వైపు వైఎస్ఆర్సీపీ లోక్ సభా పక్ష నాయకుడు మిథున్ రెడ్డి కూడా పోలవరంపై మరొక ప్రైవేట్ మెంబర్ బిల్ కూడా పెట్టారు. అది ఇవాళ టేబుల్ అవుతోంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548 కోట్లు ఆమోదించాలని ఆయన ప్రత్యేకంగా ప్రైవేట్ మెంబర్ బిల్లును పెట్టారు. పార్లమెంటు వేదికగా ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాటన్నిటినీ వినియోగించుకుంటున్నట్లు భరత్ తెలిపారు. ప్రైవేటు బిల్లులు పెట్టాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వస్తుందనేది కేంద్రం ఆలోచించాలని భరత్ కోరారు. 2014 ఏపీ విభజన చట్టాన్ని మీరు ఎందుకు గౌరవించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications