బాలయ్యపై వైసీపీ అస్త్రం- హిందూపురం ఇన్‌ఛార్జ్‌గా మహిళా నేత- తొలిసారిగా
పుట్టపర్తి: శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కోఆర్డినేటర్‌ను అపాయింట్ చేసింది. పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు టీఎన్ దీపికను సమన్వయకురాలిగా నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదలు చేసింది.
హిందూపురం.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కంచుకోట. 1983లో ఆవిర్భావించినప్పటి నుంచీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో ఓటమి చవి చూడలేదు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మూడుసార్లు ఇక్కడి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పామిశెట్టి రంగనాయకులు, నందమూరి బాలకృష్ణ రెండుసార్లు చొప్పున విజయం సాధించారు.

నందమూరి హరికృష్ణ, సీసీ వెంకట్రాముడు, పీ అబ్దుల్ ఘనీ ఒక్కోదఫా హిందూపురం అభ్యర్థులుగా పోటీ చేసి విజయఢంకా మోగించారు. ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గానికి బాలయ్య ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. 2014లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు బీ నవీన్ నిశ్చల్, 2019లో మహ్మద్ ఇక్బాల్‌ను ఆయన ఓడించారు.
ప్రస్తుతం ఇక్బాల్‌ను వైఎస్ఆర్సీపీ నాయకత్వం శాసన మండలికి ఎంపిక చేసింది. దీనితో ఈ నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిని వెదుక్కునే పనిలో పడింది. ఇప్పుడా అన్వేషణకు తెర దించింది వైఎస్ఆర్సీపీ. నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకురాలు టీఎన్ దీపికను సమన్వయకురాలిగా ఎంపిక చేసింది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో హిందూపురం టికెట్.. ఆమెకే కేటాయించడం దాదాపు ఖాయమైనట్టే.
ఇటీవలే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇన్‌ఛార్జిల సమీక్ష సమావేశానికి కూడా దీపిక హాజరయ్యారు. ఆమెను హిందూపురం కోఆర్డినేటర్‌గా అపాయింట్ చేయొచ్చనే ప్రచారం అప్పుడే ఆరంభమైంది. దీన్ని బలం కలిగించేలా వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం ఆమెను ఇన్‌ఛార్జ్‌గా నియమించింది.
పార్టీ సీనియర్ నేత, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిఫారసుల మేరకే వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. హిందూపురం నియోజకవర్గంలో ఇప్పటివరకు మహిళా అభ్యర్థులెవరూ పోటీ చేయలేదు. ఏ పార్టీ కూడా ఓ మహిళ నాయకురాలిని తమ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలపలేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్సీపీ దీపికను ఎంపిక చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications