మాచర్లలో దుమ్మురేపిన వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో సరికొత్త రికార్డు..
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దూకుడు ప్రదర్శిస్తోంది. చాలాచోట్ల ఆ పార్టీ ఏకగ్రీవాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వైసీపీ హవా కొనసాగుతోంది. మాచర్ల నియోజకవర్గంలో 71 ఎంపీటీసీ స్థానాలకు గాను 68 స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. అలాగే ఐదు జడ్పీటీసీ స్థానాలకు గాను ఐదింటిని ఏకగ్రీవం చేసుకుంది. ఇక మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నామినేషన్ల గడువు ముగిసేటప్పటికీ 31 వార్డులకు గాను 26 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
ఇక్కడ వైసీపీ సభ్యులు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. మరో ఐదుచోట్ల టీడీపీ సభ్యులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వారు కూడా వైసీపీ సానుభూతిపరులేనని తెలుస్తోంది. దాంతో మొత్తానికి మొత్తం 31 స్థానాలు వైసీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద 1983 తర్వాత మాచర్ల మున్సిపాలిటీని ఏకగ్రీవంగా గెలుచుకున్న ఏకైక పార్టీగా వైసీపీ సరికొత్త రికార్డు సృష్టించనుంది.

ఇదిలా ఉంటే,టీడీపీ నాయకులు బుద్ధా వెంకన్న, బోండా ఉమామహేశ్వర రావులపై దాడికి పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న వైసీపీ యువజన విభాగం నాయకుడు తురకా కిశోర్.. మాచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నారు. ఈ మేరకు ఆయన తరఫున అనుచరుడు మహంకాళి కన్నారావు నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దీంతో మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ రేసులో తురకా కిశోర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నేతలపై దాడి ఘటన కంటే ముందే ఆయన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే పిన్నెల్లికి ఆయన ప్రధాన అనుచరుడు కావడంతో మున్సిపల్ చైర్మన్ పదవి వరించడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.
కాగా, రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో వైసీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. గురువారం వరకు ప్రకాశం జిల్లా మార్కాపురం, గిద్దలూరు, దర్శి , కనిగిరి నియోజకవర్గాల్లో భారీగా ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 6 చోట్ల,శ్రీకాకుళంలో 2 చోట్ల వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు సొంత నియోజకవర్గం రాజాంలోనూ వైసీపీ ఏక్రగీవమైంది.
రేగిడి ఆమోదాలవలసలో 3 , సంతకవిటి మండలంలో 2 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలంలో 3 ఎంపీటీసీలు, ఎచ్చెర్ల నియోజకవర్గంలో 1 ఎంపీటీసీ ఏకగ్రీవం అయ్యాయి. ఇక పాలకొండ నియోజకవర్గం వీరఘట్టంలో ఒకటే నామినేషన్ వచ్చినట్టు ఈసీ తెలియజేసింది.












Click it and Unblock the Notifications