కౌంటింగ్ నాడు అలా చేయండి: గైడ్ లైన్స్
Vijayasai Reddy: ఏపీలో ఓట్ల లెక్కింపు గడువు దగ్గరికొచ్చింది. ఎంతో సమయం లేదు. ఎల్లుండే కౌంటింగ్. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాల ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతతో ఎదురు చూస్తోన్నారు. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్.. కౌంటింగ్‌పై మరింత ఆసక్తిని రేకెత్తించాయి.
ఓట్ల లెక్కింపు కోసం అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎలాంటి రిస్క్ తీసుకోదలచుకోలేదు. దీనిపై కౌంటింగ్ ఏజెంట్లకు ప్రత్యేకంగా వర్క్‌షాప్‌ను సైతం నిర్వహించింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంతో పాటు వివిధ లోక్‌సభ నియోజకవర్గ కేంద్రాల్లో ఈ వర్క్‌షాప్ ముగిసింది.

నెల్లూరులో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వీ విజయసాయి రెడ్డి పాల్గొన్నారు. కౌంటింగ్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేశారు. మళ్లీ తాము అధికారంలోకి రాబోతోన్నామని తేల్చి చెప్పారు. నెల్లూరు లోక్‌సభతో పాటు ఏడు అసెంబ్లీ స్ధానాల్లోనూ గెలవబోతోన్నామని విశ్వాసం వ్యక్తం చేశారు.
కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి చివరి రౌండ్ పూర్తిగా ముగిసేంత వరకు ప్రతి విషయాన్ని ఏజెంట్లు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. పోస్టల్ బ్యాలెట్‌పై ఉన్న సంతకం విషయంలో ఎలాంటి అనుమానం ఉన్నా దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రత్యర్థులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తారని, అలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
నెల్లూరు పార్లమెంటు స్థానంతోపాటు, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. శ్రీ జగన్ మోహన్ రెడ్డిగారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. పేదలు, బడుగు బలహిన వర్గాలు, మహిళలు, గ్రామీణులు మన పార్టీకి ఓట్లు… pic.twitter.com/aMue5mFEe0
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 2, 2024
పేదలు, బడుగు బలహీన వర్గాలు, మహిళలు, గ్రామీణ ప్రాంత ప్రజలు తమ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేశారని గుర్తు చేశారు. ఏ ఒక్క ఓటు కూడా వృధా కానివ్వకూడదని చెప్పారు. జిల్లాలో కీలక నియోజకవర్గాలుగా ఉన్న నెల్లూరు సిటీ, కోవూరులో కూడా పార్టీ అభ్యర్థులు అంచనాలకు మించిన మెజారిటీతో విజయం సాధిస్తారని సాయిరెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications