అక్కడ గెలవడం వైసీపీకి ప్రతిష్ఠాత్మకం
Parchur Assembly round up 2024: బాపట్ల జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలన్నింట్లోనూ ఉత్కంఠభరిత పోరు పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నెలకొంది. తెలుగుదేశం పార్టీకి గట్టిపట్టు ఉన్న స్థానం ఇది. ఆరు సార్లు ఇక్కడ పసుపు జెండా ఎగిరింది. ఇప్పుడు కూడా పర్చూరు టీడీపీ ఖాతాలోనే ఉంది. ఈ సారి దీన్ని కైవసం చేసుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది.
బాపట్ల లోకసభ నియోజకవర్గంలోని జనరల్ అసెంబ్లీ నియోజకవర్గం పర్చూరు. యద్దనపూడి, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు, చిన గంజాం, మార్టూరు మండలాలు దీని పరిధిలోకి వస్తాయి. సంఖ్యాపరంగా గానీ, రాజకీయంగా గానీ ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గాల వారి ఆధిపత్యమే ఎక్కువ. ఆ తరువాత రెడ్డి, కాపు, ఎస్సీ, యాదవులు, ముస్లిం, వైశ్య కులాల వారు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించక ముందు అయిదు ఎన్నికలు జరిగ్గా.. మూడుసార్లు కాంగ్రెస్ గెలిచింది. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కోసారి విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భవించిన తరువాత ఒక ఉప ఎన్నిక సహా మొత్తం 10 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆరుసార్లు విజయం ఆ పార్టీనే వరించింది. అందులో రెండుసార్లు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గెలిచారు. మంత్రిగా పని చేశారు.
నాలుగుసార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఇక్కడ. ఇక్కడ కూడా దగ్గుబాటి వెంకటేశ్వరరావు రెండు సార్లు గెలిచారంటే ఆయనకు ఈ నియోజకవర్గం మీద ఏ స్థాయిలో పట్టు ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో రెండుసార్లు గాదె వెంకటరెడ్డి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన వెంకటేశ్వరరావు టీడీపీకి చెందిన గొట్టిపాటి నరసింహారావుపై విజయఢంకా మోగించారు.

2014లో టీడీపీ పర్చూరులో పాగా వేసింది. ఆ పార్టీ అభ్యర్ధి ఏలూరి సాంబశివరావు.. వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసిన గొట్టిపాటి భరత్ కుమార్‌పై 10,775 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2019లో కూడా ఇదే రిజల్ట్ రిపీట్ అయింది. వైసీపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై కేవలం 1,647 ఓట్ల మెజారిటీతో గెలిచారు ఏలూరి సాంబశివరావు.
వైఎస్ఆర్సీపీ ఇంకా బోణీ కొట్టిన నియోజకవర్గాల్లో పర్చూరు కూడా ఒకటి. 2024 ఎన్నికల్లో తన వ్యూహాన్ని మార్చింది వైసీపీ. పర్చూరు టికెట్‌ను యడం బాలాజీకి ఇచ్చింది. టీడీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావే పోటీలో ఉన్నారు. ఈ సారి గెలుపెవరిదనేది ఆసక్తి రేపుతోంది.












Click it and Unblock the Notifications