వ్యూహం మార్చిన వైసీపీ.. రాజ్యసభలో జగన్ బాబాయ్ కీలక డిమాండ్
ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండపై వైసీపీ తన పోరాటాన్ని తీవ్రతరం చేసింది. అక్కడ జరుగుతున్న మైనింగ్ వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతోందని, వారసత్వ సంపద నాశనమవుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రాజ్యసభలో ఖనిజాల చట్ట సవరణ బిల్లు-2026పై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. పంచదార్లలోని పురాతన ప్రదేశాలను, సహజ జలాశయాలను పరిరక్షించేందుకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

పురాతన వారసత్వ క్షేత్రాలకు తీవ్ర ముప్పు!
పంచదార్లలో ఉన్న సంరక్షిత బౌద్ధ క్షేత్రం, పురాతన ధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి అత్యంత సమీపంలో మైనింగ్ కార్యకలాపాలు సాగుతున్నాయని వైవీ సుబ్బారెడ్డి సభ దృష్టికి తెచ్చారు. ఆలయ సముదాయం గుండా ప్రవహించే ఐదు సహజ జలాశయాలతోనే పంచదార్లకు ఆ పేరు, గుర్తింపు ముడిపడి ఉన్నాయని వివరించారు.
రక్షిత ప్రాంతాల వద్దకు మైనింగ్ పొంచి రావడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ పర్యావరణానికి జరుగుతున్న హానిని పరిశీలించేందుకు క్షేత్రస్థాయి తనిఖీలు చేపట్టాలని, నీటి కాల్వలపై హైడ్రోలాజికల్ అధ్యయనం జరిపించాలని కోరారు. ఆ అధ్యయనం పూర్తయ్యే వరకు అక్కడ ఎలాంటి మైనింగ్ జరగకుండా తక్షణమే నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రాల ఆదాయాలు, పర్యావరణాన్ని పరిరక్షించాలి!
ఖనిజాల చట్ట సవరణ బిల్లుపై మాట్లాడుతూ.. ఖనిజ సంపద ప్రజల ఆస్తి అని, దాని నిర్వహణలో పూర్తి పారదర్శకత ఉండాలని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వృద్ధికి స్పష్టమైన మైనింగ్ విధానం అవసరమే అయినప్పటికీ, అది రాష్ట్రాల ఆదాయాలకు, స్థానిక ప్రజల జీవనోపాధికి లేదా పర్యావరణ పరిరక్షణకు భంగం కలిగించకూడదని హితవు పలికారు. మైనింగ్ వల్ల తలెత్తే పర్యావరణ, మౌలిక సదుపాయాల వ్యయ భారాన్ని రాష్ట్రాలే మోస్తాయని, అందుకే మైనింగ్ విధానాల రూపకల్పనలో రాష్ట్రాల ప్రయోజనాలు, ఆదాయాలను కాపాడేలా నిర్ణయాలు ఉండాలని స్పష్టం చేశారు.














Click it and Unblock the Notifications