మంత్రి సెక్స్ టేప్ వివాదంలో అనూహ్య ట్విస్ట్... వెనక్కి తగ్గిన యాక్టివిస్ట్... కేసు ఉపసంహరణ..?
కర్ణాటక మంత్రి రమేష్ జర్కిహెళి సెక్స్ టేప్ వివాదంలో అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంది. మంత్రి రాసలీలల వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చిన సామాజిక కార్యకర్త దినేశ్ కళహళ్లి ఈ కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తన న్యాయవాది ద్వారా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌కు ఆయన ఓ లేఖ పంపించారు. రమేష్ జర్కిహోళిపై తాను పెట్టిన కేసును ఉపసంహరించాలని అందులో కోరారు.

దినేశ్ న్యాయవాది ఏమన్నారంటే...
దినేశ్ కలహళ్లి తరుపు న్యాయవాది ఆ లేఖను కబ్బన్ పార్క్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు అప్పగించారు. తన క్లైంట్ దినేశ్‌పై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని... కేసును ఉపసంహరించుకోవాలని ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. 'నా క్లైంట్ దినేశ్ ఒక సామాజిక కార్యకర్త... ప్రజల హక్కుల కోసం పోరాడుతుంటాడు. అతని ప్రధాన ఉద్దేశం బాధిత మహిళకు న్యాయం జరగడం.
కానీ రూ.5కోట్ల కోసం డిమాండ్ చేసి ఇదంతా చేస్తున్నట్లుగా దినేశ్‌పై ఆరోపణలు వచ్చాయి. అలాగే ఆ మహిళ,ఆమె కుటుంబం పరువు పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దినేశ్ రమేశ్ జర్కిహోళిపై కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారు.' అని దినేశ్ న్యాయవాది తెలిపారు.అదే సమయంలో పోలీసులకు అవసరమైన సమాచారాన్ని ఇచ్చేందుకు దినేశ్ ఎప్పుడైనా సిద్దమేనని న్యాయవాది వెల్లడించారు.

కుమారస్వామి వ్యాఖ్యలు బాధించాయని...
రమేశ్ జర్కిహోళి రాసలీలల వ్యవహారం వెనుక రూ.5కోట్ల డీల్ ఉందని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన ఆరోపణలు తనను బాధించాయని దినేశ్ కలహళ్లి అన్నారు. అందుకే కేసును ఉపసంహరించుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసు పెట్టినప్పటి నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు చెప్పిన దినేశ్.. తనకు రక్షణ కల్పించాలని గతంలోనే పోలీసులను కోరినట్లు గుర్తుచేశారు. దినేశ్ లేఖను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని కబ్బన్ పార్క్ పోలీసులు వెల్లడించారు.

దుమారం రేపిన రాసలీలల టేప్...
కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేశ్ జర్కిహోళి కేపీటీసీఎల్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి మహిళను శారీరకంగా లొంగదీసుకున్నాడని ఆరోపిస్తూ.. దానికి సంబంధించిన వీడియో టేపును దినేశ్ కలహళ్లి బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన ఆ టేపును మీడియాకు కూడా రిలీజ్ చేశారు.
అప్పటినుంచి ఆ టేపు అటు మీడియాలో,ఇటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రమేశ్ వ్యవహారం అధికార బీజేపీకి తలనొప్పిగా మారడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయక తప్పలేదు. తనకేమీ తెలియదంటూనే నైతికతతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు రమేశ్ జర్కిహోళి అనుచరులు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గోకక్ నియోజకవర్గంలో నిత్యం నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉద్దేశపూర్వకంగానే తమ నేతను ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications