బ్యాంకుల మెరుపు సమ్మె: వీటికి తాళాలు- అవి ఓపెన్
ప్రభుత్వ రంగ బ్యాంకుల కార్యకలాపాలు నేడు స్తంభించిపోయాయి. దేశవ్యాప్త సమ్మె కారణంగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతోంది. అయిదు రోజుల పని వారాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ నెల 23వ తేదీన చీఫ్ లేబర్ కమిషనర్‌తో జరిగిన సమావేశంలో సమస్యలు పరిష్కారం కుదరకపోవడంతో సమ్మె అనివార్యమైంది.
తొమ్మిది యూనియన్ల సమాఖ్య, ప్రభుత్వ రంగ బ్యాంకులలోని ఆఫీసర్లు, ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఇప్పటికే 25 (ఆదివారం), 26 (సోమవారం గణతంత్ర దినోత్సవం) కారణంగా బ్యాంకులు మూసి ఉండటంతో, వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడీ సమ్మె వల్ల ఈ పరిస్థితులు నేడు కూడా కొనసాగుతున్నాయి. నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలు, చెక్ క్లియరెన్సులు, శాఖల సాధారణ కార్యకలాపాలు వంటి ప్రధాన సేవలు నేడు ఆగిపోయాయి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా సహా ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ సేవలను అందించలేకపోవచ్చు. హెచ్ డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి ప్రైవేట్ రంగ బ్యాంకులు యథావిధిగా పనిచేస్తాయి. యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ ఛానెల్స్ అందుబాటులో ఉంటాయి. లాజిస్టికల్ కారణాలతో కొన్ని ఏటీఎంలలో నగదు కొరత ఉండవచ్చు.
అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు సమ్మె ప్రభావం గురించి స్టాక్ ఎక్స్ఛేంజీలకు ముందుగానే తెలియజేశాయి. ఎస్‌బీఐ, సాధారణ కార్యకలాపాలకు ఏర్పాట్లు చేసినా, సేవలకు అంతరాయం కలగవచ్చని అంగీకరించింది. ఈ నిరసనకు ముఖ్య కారణం- అన్ని శనివారాలను బ్యాంకు సెలవులుగా ప్రకటించాలనే డిమాండ్.
2024 మార్చిలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో కుదిరిన 12వ ద్వైపాక్షిక ఒప్పందంలో ఈ ప్రతిపాదన ఉన్నప్పటికీ, దీనికి ఇంకా ప్రభుత్వ నోటిఫికేషన్ రాలేదు. ప్రస్తుతం, బ్యాంకులు ప్రతి నెల మొదటి, మూడవ, అయిదవ శనివారాల్లో పనిచేస్తున్నాయి.












Click it and Unblock the Notifications