వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐటీ శాఖ సంచలనం: రూ.17,600 కోట్లకు మోసం.. పీఎన్బీకి సీవీసీ సమన్లు

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ ముంబై: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్బీ)లో వెలుగు చూసిన కుంభకోణం నేపథ్యంలో ఆదాయం పన్ను (ఐటీ) శాఖ రూపొందించిన నివేదిక మరింత సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈ బ్యాంకుకు జరిగిన మోసం విలువ రూ.11,400 కోట్లని భావిస్తున్నారు. కానీ ఆదాయం పన్ను (ఐటీ) శాఖ మాత్రం ఇది రూ.17,600 కోట్లకు చేరవచ్చని అంచనా వేస్తోంది.

ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆభరణాల వ్యాపారి నీరవ్‌ మోదీకి, అతని మేనమామ మెహుల్‌ ఛోక్సీకి కలిపి గత ఏడాది మార్చి వరకు బ్యాంకులు ఇంత మొత్తాన్ని రుణాలు, హామీలుగా జారీ చేశాయని ఐటీ శాఖ వర్గాలు శనివారం తెలిపాయి. అందువల్ల వాస్తవ మొత్తం ఎక్కువే ఉండవచ్చని ఆ నివేదికలో ఉన్నట్లు రాయిటర్స్‌ పేర్కొన్నది.

 పీఎన్బీ ఎండీకి సీవీసీ నోటీసులు జారీ ఇలా

పీఎన్బీ ఎండీకి సీవీసీ నోటీసులు జారీ ఇలా

పీఎన్బీ కుంభకోణ వ్యవహారంలో పన్ను ఎగవేత కోణంలో ఐటీ శాఖ దర్యాప్తు చేస్తోంది. నీరవ్‌ మోదీకి గ్రూపునకు చెందిన 29 ఆస్తులు, 105 బ్యాంకు ఖాతాలను ఇప్పటివరకు స్తంభింపజేసినట్లు ఆ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఖాతాల్లో రూ.80 లక్షల నిల్వలు ఉన్నాయి. ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానంలో ఐటీ శాఖ చార్జీషీట్ నమోదు చేసింది. దీనిపై ఈ నెల 27న విచారణ జరగనున్నది. మరోపక్క ఈ వ్యవహారంలో పీఎన్బీ యాజమాన్యం, ఆర్థిక శాఖ అధికారుల్ని తమ ఎదుట హాజరుకావాలని కేంద్ర నిఘా కమిషన్‌ (సీవీసీ) సమన్లు జారీ చేసింది. బ్యాంకు ఎండీ సునీల్‌ మెహతా, బ్యాంకులో ముఖ్య నిఘా అధికారితో కలిసి సోమవారం సీవీసీ ఎదుట హాజరుకానున్నారని సమాచారం.

 భరోసా పత్రాలు లేకుండానే ఎల్వోయూల జారీ ఇలా

భరోసా పత్రాలు లేకుండానే ఎల్వోయూల జారీ ఇలా

పీఎన్‌బీని మోసగించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం ముగ్గురిని అరెస్టు చేసింది. బ్యాంకు మాజీ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ గోకుల్‌నాథ్‌ శెట్టి, సింగిల్‌విండో ఆఫీసర్‌ మనోజ్‌ కారాట్‌, నీరవ్‌ మోదీ గ్రూపు సంస్థల అధీకృత ప్రతినిధి హేమంత్‌ భట్‌లను అరెస్టు చేశాక వారిని ముంబైలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరిచారు. వీరిని 14 రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఎస్‌ఆర్ తంబోలి ఆదేశాలిచ్చారు. దేశ ఆర్థిక వ్యవస్థపైనే ప్రభావం చూపే తీవ్రత ఈ కేసులో ఉన్నదని చెప్పారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి, అనుమతులు లేకుండా, కుట్రపూరితంగా శెట్టి వ్యవహరించారని సీబీఐ ఆరోపించింది. వారు జారీ చేసిన భరోసా పత్రాలకు ఎటువంటి పత్రాలు, దరఖాస్తులు బ్యాంకులో లేనేలేవని తెలిపింది. ఇలాంటివి చాలా సార్లు జరిగాయని కారాట్‌ చెబుతున్నా పేర్లు మాత్రం వెల్లడించ లేదన్నది. నీరవ్‌కు చెందిన 15-16 కంపెనీల్లో భట్‌ డైరెక్టర్‌గా ఉన్నారనీ, మొత్తం వ్యవహారం అతనికి తెలుసుననీ చెప్పింది. వారి నుంచి ముఖ్య పత్రాలు రాబట్టేందుకు వీలుగా కస్టడీకి అప్పగించాలని కోరింది. ముంబైలోని బ్రాడీరోడ్‌ శాఖలోనూ సీబీఐ సోదాలు నిర్వహించింది. పలు కీలకపత్రాలు స్వాధీనం చేసుకొంది. అంతర్జాతీయంగా నిధుల బదలాయింపు జరిగే విధానం గురించి అధికారుల్ని ప్రశ్నించింది. ఆరుగురు అధికారులను వివిధ కోణాల్లో విచారించింది.

ఖాతాలు, లాకర్ల వివరాలపై ఆరా

ఖాతాలు, లాకర్ల వివరాలపై ఆరా

పశ్చిమ ముంబైలోని మలాద్‌లో ఉన్న శెట్టి ఫ్లాట్‌కు సీబీఐ బలగాలు చేరుకుని రెండ్రోజులుగా ఆయన కుటుంబీకుల్ని, బంధువుల్ని ప్రశ్నించాయి. ఆ ఫ్లాట్ ఎప్పుడు కొనుగోలు చేశారు? చెల్లింపులు ఎలా జరిపారు? ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? వంటి వివరాలు ఆరా తీశాయి. బ్యాంకు ఖాతాలు, ఇతర ఆస్తులు, లాకర్ల వివరాలనూ రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. శెట్టి, కారాట్‌ నీరవ్‌ మోదీ కంపెనీతో కుమ్మక్కై రూ.4886.70 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. అనధీకృత, తప్పుడు ‘భరోసా పత్రాలు' (ఎల్వోయూ) విదేశాల్లోని వివిధ భారతీయ బ్యాంకుల శాఖలకు జారీ చేయడంలో వీరిద్దరిదీ కీలక పాత్ర అని ఆరోపించింది. ఈ ఎల్వోయూలు ఎక్కడా దొరక్కుండా చూడడానికి వాటిని కోర్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి తప్పించినట్లు తెలిపింది. రూ.280 కోట్ల మోసంపై తొలుత ఒక కేసు నమోదు కాగా దానిని ఇప్పుడు రూ.6498 కోట్లు మోసమని సవరించింది.

 నగల దుకాణాల్లో ఈడీ సోదాలు

నగల దుకాణాల్లో ఈడీ సోదాలు

పీఎన్బీకి నీరవ్‌మోదీ సమర్పించిన మూడు చిరునామాల్లో అసలు ఎలాంటి వజ్రాభరణాల కంపెనీలూ లేవని తేలింది. రుణాలు తీసుకునేటప్పుడు కంపెనీల తాజా చిరునామాలను పేర్కొనలేదని బయటపడింది. కేసు నమోదయ్యాక సీబీఐ వర్గాలు తొలుత ఈ చిరునామాల్లోనే గాలించాయి. కోల్‌కతాలోని గీతాంజలి జెమ్స్‌ దుకాణం కూడా మూతబడి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీతో సంబంధం ఉన్న చెన్నైలోని మూడు నగల దుకాణాల్లో ఈడీ అధికారులు శనివారం మెరుపు సోదాలు జరిపారు. జమ్ముతోపాటు 21 ప్రదేశాల్లో జరిగిన తాజా సోదాల్లో మరో రూ.25 కోట్ల వజ్రాలు, ఆభరణాలను సీజ్‌ చేశామనీ, మొత్తం విలువ రూ.5674 కోట్లకు చేరిందనీ ఈడీ వర్గాలు ఢిల్లీలో తెలిపాయి.

నెల పాటు నీరవ్, చోక్సీ పాస్ పోర్టుల రద్దు

నెల పాటు నీరవ్, చోక్సీ పాస్ పోర్టుల రద్దు

నీరవ్‌ మోదీ ఆచూకీ తెలుసుకోవడానికి సీబీఐ అభ్యర్థన మేరకు ఇంటర్‌పోల్‌ నుంచి లుక్‌అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఈడీ సూచన మేరకు నీరవ్‌ మోదీ, మెహుల్‌ ఛోక్సీ పాస్‌పోర్టులను నెలపాటు సస్పెండ్‌ చేస్తున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. వాటిని ఎందుకు రద్దు చేయకూడదో వారంలో వివరణ ఇచ్చుకునే అవకాశాన్ని నిందితులకు ఇచ్చింది. దావోస్‌కు వెళ్లిన ప్రతినిధి బృందంలో నీరవ్‌ మోదీ లేరనీ, అతనితో ప్రధాని ఎలాంటి భేటీ నిర్వహించలేదనీ ఈ శాఖ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా నీరవ్‌, ఛోక్సీలకు ఈడీ రెండోసారి సమన్లు జారీ చేసింది. వచ్చేవారం ముంబై కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించింది.

English summary
NEW DELHI: Indian banks could take a hit of at least $2.74 billion (Rs 17,600 crore) from loans and corporate guarantees provided to Punjab National Bank in a Rs 11,400-crore fraud case, the tax department said. As of March 2017, banks had extended loans and guarantees worth Rs 17,600 crore to companies tied to billionaire jeweller Nirav Modi and his uncle Mehul Choksi, the tax department said in a note seen by news agency Reuters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X