నూతనంగా సంపద పన్ను: వారిపై 5 % అదనం
అమెరికాలోని సంపన్న రాష్ట్రం కాలిఫోర్నియా త్వరలో ఓ చారిత్రాత్మక నిర్ణయానికి వేదిక కాబోతోంది. అక్కడ నివసించే బిలియనీర్లపై ప్రత్యేకంగా సంపద పన్ను (Wealth Tax) విధించాలా వద్దా అనే అంశంపై ఓటింగ్ నిర్వహించనుంది. నవంబర్ 3వ తేదీన ఈ ఓటింగ్ జరుగనుంది. ఈ ప్రతిపాదనలకు అనుకూల నిర్ణయం వెలువడితే మాత్రం.. బిలియనీర్లపై ఇటువంటి పన్నును వేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి నగరంగా కాలిఫోర్నియా నిలిచిపోతుంది.
ఈ మేరకు కాలిఫోర్నియా ప్రభుత్వం ప్రపోజిషన్ 40 యాక్ట్ ను ప్రవేశపెట్టింది. దీనికింద ఒక బిలియన్ డాలర్లు అంటే.. భారత కరెన్సీలో దాదాపు 8,300 కోట్ల రూపాయలకు మించి నికర ఆస్తి కలిగిన సంపన్నులపై ఒకేసారి అయిదు శాతం పన్ను విధించాలని ఇందులో ప్రతిపాదించింది. గూగుల్, యాపిల్, మెటా, ఎన్విడియా వంటి ప్రపంచ స్థాయి టెక్ దిగ్గజాలు, పారిశ్రామికవేత్తలు అత్యధికంగా నివసిస్తోన్నది, తమ కార్యకలాపాలను కొనసాగిస్తోన్నది ఈ రాష్ట్రంలోనే.

ఈ ప్రతిపాదనకు నోబెల్ అవార్డు పొందిన ఆరుమంది ఆర్థికవేత్తలు సమర్థించారు. ఈ మేరకు కాలిఫోర్నియా ప్రభుత్వానికి బహిరంగంగా లేఖలు రాశారు. ఈ ఆరుమందిలో భారత సంతతికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ, ఎస్తేర్ డుఫ్లో, జోసెఫ్ స్టిగ్లిట్జ్, పాల్ క్రుగ్‌మన్, పీటర్ డైమండ్, డారెన్ ఎసెమోగ్లు ఉన్నారు. కాలిఫోర్నియాలో 0.001 శాతం మంది సూపర్ రిచ్ వ్యక్తుల వద్ద ఉన్న సంపద దాదాపు 2.3 ట్రిలియన్ డాలర్లకు చేరిందని, రాష్ట్రంలోని కోట్లాది మంది సాధారణ పన్ను చెల్లింపుదారుల మొత్తం వార్షిక ఆదాయంతో సమానమని పేర్కొన్నారు.
ఆర్థిక అసమానతలను అరికట్టడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఈ సంపద పన్ను ఎంతగానో ఉపయోగపడుతుందని నోబెల్ అవార్డు గ్రహీతలు తేల్చి చెప్పారు. సామాజిక శ్రేయస్సును కాంక్షించే వాళ్లెవరూ దీన్ని వ్యతిరేకించబోరని అభిప్రాయపడ్డారు. ఈ చట్టం ఆమోదం పొందితే కాలిఫోర్నియాతో పాటు అమెరికా, ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి నూతన పన్ను సంస్కరణలు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు.. ఈ పన్ను ప్రతిపాదనల పట్ల వ్యతిరేకత ఎదురవుతోంది. దీన్ని అడ్డుకోవడానికి గూగుల్ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ ఏకంగా 100 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చి మరీ వ్యతిరేక ప్రచారాన్ని ముమ్మరం చేయించారు. సోవియట్ యూనియన్ సోషలిస్ట్ అణచివేత విధానాల నుండి తన కుటుంబం అమెరికాకు వలస వచ్చిందని గుర్తు చేశారు. కాలిఫోర్నియాలో మళ్లీ అటువంటి విధానాలకు తెర తీసే ప్రయత్నాలు సాగుతోండటం సరికాదని వ్యాఖ్యానించారు.
పన్ను పరిధి నుంచి తప్పించుకోవడానికి కొందరు సంపన్నులు ముందే రాష్ట్రం దాటే అవకాశం ఉందని కాలిఫోర్నియా ప్రభుత్వం భావిస్తోంది. ఈ చట్టాన్ని ఈ ఏడాది జనవరి 1 నుండి వర్తించేలా ప్రతిపాదించారు. అయినప్పటికీ.. సెర్గీ బ్రిన్, లారీ పేజ్, వెంచర్ క్యాపిటలిస్ట్ పీటర్ థీల్, ఉబెర్ కోఫౌండర్ ట్రావిస్ కలానిక్ వంటి పలువురు కాలిఫోర్నియా వదిలి ఇతర తక్కువ పన్నులు ఉన్న ప్రాంతాలకు నివాసాలు మార్చుకుంటోన్నారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
