Education loan: వేరే బ్యాంక్‌కు లోన్ మారుస్తున్నారా? తొందరపడితే లాభం కాదు నష్టమే!
ఉన్నత చదువుల కోసం తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్లు కోర్సు పూర్తయిన తర్వాత సుదీర్ఘ కాలం పాటు ఈఎంఐల రూపంలో వెన్నాడుతూనే ఉంటాయి. అయితే రీపేమెంట్ ప్రక్రియ ప్రారంభమయ్యాక లేదా కొన్ని సంవత్సరాలు గడిచాక.. మీ ప్రస్తుత బ్యాంక్ కంటే వేరొక బ్యాంక్ తక్కువ వడ్డీ రేటుకే రుణం ఇస్తున్నట్లు మీ దృష్టికి రావచ్చు.
అలాంటప్పుడు పాత బ్యాంక్‌లోనే ఎక్కువ వడ్డీ కడుతూ కూర్చోవాల్సిన అవసరం లేదు. వేరే బ్యాంక్‌కు మీ లోన్‌ను మార్చుకునే 'బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్' సదుపాయం అందుబాటులో ఉంది. అయితే కేవలం వడ్డీ రేటు తక్కువగా ఉందనే ఒకే ఒక్క కారణంతో తొందరపడి నిర్ణయం తీసుకుంటే మాత్రం లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే ప్రమాదముంది.

రుణం మార్చడం వెనుక అసలు లాభం ఏమిటి?
ఎడ్యుకేషన్ లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్‌లో అత్యంత కీలకమైనది వడ్డీ రేటు. అసలు మొత్తం ఎక్కువగా ఉండి, తీర్చడానికి ఇంకా చాలా ఏళ్ల సమయం ఉన్నప్పుడు వడ్డీలో అర శాతం లేదా ఒక శాతం కోత పడినా భారీ మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది. దీనివల్ల ప్రతి నెలా కట్టే ఈఎంఐ లేదా మొత్తం అప్పు తీరే కాల పరిమితి గణనీయంగా తగ్గుతుంది. అయితే ఈ మార్పు ప్రక్రియ మీ బాకీ ఉన్న అసలు, మిగిలి ఉన్న కాలపరిమితి, కొత్త బ్యాంక్ విధించే ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర చార్జీలపై ఆధారపడి ఉంటుంది.
అర్హత ఉందో లేదో ముందే చెక్ చేసుకోండి!
లోన్ బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్ అనేది ఏదో హక్కుగా దక్కేది కాదు. కొత్త బ్యాంక్ మీ పాత లోన్ రీపేమెంట్ ట్రాక్ రికార్డ్‌ను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఇప్పటివరకు ఈఎంఐలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా సరైన సమయానికి చెల్లించిన వారికి మాత్రమే ఇతర బ్యాంకులు ప్రాధాన్యత ఇస్తాయి. మీ ఆదాయ మార్గాలు, మీతో పాటు లోన్ తీసుకున్న గ్యారెంటర్ ఆర్థిక స్థితిగతులను బేరీజు వేసుకున్నాకే కొత్త బ్యాంక్ ఈ రుణాధికారాన్ని వేరొక బ్యాంకు నుంచి తన వద్దకు బదిలీ చేసుకోవడానికి అంగీకరిస్తుంది.
అదనపు బాదుడును లెక్కలేసుకోండి: అసలు పొదుపు ఎంత?
ఉదాహరణకు మీ లోన్ ఖాతాలో ఇంకా రూ. 8 లక్షల బాకీ ఉండి, మరో నాలుగు ఏళ్ల కాలపరిమితి ఉందనుకుందాం. కొత్త బ్యాంక్ వడ్డీ రేటు తగ్గించినప్పటికీ.. లోన్ బదిలీ ప్రక్రియలో ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ చార్జీలు ఎంత వసూలు చేస్తున్నారో లెక్కించాలి. ఆ చార్జీలను మినహాయించిన తర్వాత కూడా మీకు చెప్పుకోదగ్గ స్థాయిలో లాభం ఉంటేనే ట్రాన్స్‌ఫర్‌కు మొగ్గు చూపడం తెలివైన పని. అంతేకాకుండా, పాత బ్యాంక్ నుంచి ఆఫిషియల్ 'ఫోర్‌క్లోజర్' స్టేట్‌మెంట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
తక్కువ ఈఎంఐల ట్రాప్‌లో పడకండి! ఆదాయ పన్ను మినహాయింపుల సంగతేంటి?
కొత్త బ్యాంక్ ప్రతి నెలా కట్టాల్సిన ఈఎంఐని బాగా తగ్గించి చూపుతోందని మురిసిపోవద్దు. అసలు కాలపరిమితిని పెంచడం ద్వారా కూడా ఈఎంఐ తగ్గేలా చేస్తాయి. దీనివల్ల ప్రతి నెలా భారం తగ్గినట్లు అనిపించినా, సుదీర్ఘ కాలం వడ్డీ చెల్లించడం వల్ల మీ జేబుకు కన్నం పడుతుంది. మరోవైపు ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80E కింద ఎడ్యుకేషన్ లోన్ వడ్డీపై లభించే పన్ను మినహాయింపులు కొత్త బ్యాంక్‌కు మారిన తర్వాత ఎలా వర్తిస్తాయో మీ ఆడిటర్ ద్వారా స్పష్టత తెచ్చుకోవడం శ్రేయస్కరం.














Click it and Unblock the Notifications